Sep 17,2023 23:29

డాక్టర్‌ బి.మీనాక్షి, డిఎంహెచ్‌ఒ

* ప్రజలకు వైద్యం అందించడమే లక్ష్యం
* క్షేత్ర స్థాయిలో ఇంటింటా సర్వే పూర్తి
* 30 నుంచి గ్రామగ్రామాన వైద్య శిబిరాలు
* కేన్సర్‌పై అవగాహనా కార్యక్రమాలు
* డిఎంహెచ్‌ఒ బి.మీనాక్షి
ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌: 
జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం సమర్థవంతంగా జరపడానికి అవసరమైన పూర్తిస్థాయి ఏర్పాట్లు చేశామని, ఈ నెల 30 నుంచి గ్రామాల్లో ఇంటింటికీ వైద్యం అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ బొడ్డేపల్లి మీనాక్షి తెలిపారు. క్షేత్ర స్థాయిలో వాలంటీర్లు అన్ని కుటుంబాలనూ సందర్శించి ఆరోగ్య సమస్యలు ఉన్న వారిని గుర్తిస్తున్నారని తెలిపారు. వారిచ్చిన నివేదికల ఆధారంగా ఎఎన్‌ఎంలు, క్లస్టర్‌ హెల్త్‌ ఆఫీసర్ల (ఎంఎల్‌హెచ్‌పిలు)లు ఇంటింటికీ వెళ్లి అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. గ్రామాల్లో వైద్యా శిబిరాలను ఏర్పాటు చేయడం ద్వారా ప్రతి ఒక్కరికీ వైద్యం అందించడానికి వీలవుతుందన్నారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో మందులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పంపించామని చెప్పారు. శిబిరాల్లో ప్రజలకు అవసరమైన మందులు అందిస్తామని పేర్కొన్నారు. ఎక్కడైనా దీర్ఘకాలిక, గుండె సంబంధిత, కాలేయ, కిడ్నీ సంబంధిత రోగాలు ఉన్నట్టు గుర్తిస్తే వారికి మెరుగైన వైద్యం కోసం పంపిస్తామని అన్నారు. ఆరోగ్య సురక్ష కార్యక్రమంతో పాటు జిల్లాలో అందిస్తున్న వైద్య సేవలపై ఆమె 'ప్రజాశక్తి'తో మాట్లాడారు.
నిర్వహణకు ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి?
జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని గ్రామాల్లో, వార్డుల్లో సమర్థవంతంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే ఇంటింటా సర్వే, వైద్య పరీక్షలు పూర్తి చేసి రోగగ్రస్థులను గుర్తించే ప్రక్రియ సాగుతోంది. ఈ నెల 30 నుంచి వైద్య శిబిరాలు ప్రారంభం కానున్నాయి. ప్రధానంగా దీర్ఘకాల ప్రాణాంతక రోగాలను గుర్తించడానికి వీలుగా ఇంటింటా సర్వే చేపట్టాం. వాలంటీర్లు సర్వే నిర్వహించి ఇచ్చిన నివేదికల ఆధారంగా వైద్య శిబిరాలు నిర్వహిస్తారు. శిబిరాలకు ఇద్దరు స్పెషలిస్టులు, ఇద్దరు పిహెచ్‌సి డాక్టర్లు హాజరవుతారు. రోగులకు గ్రామాల్లోనే వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు అందజేస్తాం.
కేన్సర్‌ రోగులను గుర్తించడానికి తీసుకున్న చర్యలు ఏమిటి?
కేన్సర్‌ వ్యాధి ప్రాణాంతకమే అయినా సకాలంలో గుర్తించడం ద్వారా నయం చేసేందుకు వీలుంటుంది. ప్రధానంగా ఈ వ్యాధి నిర్ధారణపై ప్రజల్లో అవగహన అవసరం. ఇప్పటికే గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. కేన్సర్‌ రోగాన్ని గుర్తించడానికి వీలుగా వ్యాధి నిర్థారణ సకాలంలో చేపట్టేందుకు మహాత్మా గాంధీ కేన్సర్‌ ఇనిస్టిట్యూట్‌ సర్జికల్‌ ఆంకాలజీ విభాగం ఆధ్వర్యాన వైద్యులకు అవగాహన కల్పించామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన లేక పోవడం వల్ల సకాలంలో వైద్యం పొందలేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారులు కేన్సర్‌ వ్యాధిపై ప్రజల్లో గ్రామస్థాయిలో అవగాహన కల్పించి వ్యాధిగ్రస్తులను ప్రాథమిక స్థాయిలోనే గుర్తించేందుకు వీలుంది. ప్రతి సోమవారమూ రిమ్స్‌ ఆస్పత్రికి కేన్సర్‌ అనుమానం ఉన్న రోగులను పంపిస్తే మహాత్మ గాంధి కేన్సర్‌ ఆస్పత్రి డాక్టర్‌ పి.వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యాన సర్జికల్‌ ఒపి నిర్వహించనున్నారు. ప్రధానంగా భాగంగా నోటి కేన్సర్‌, లంగ్‌ కేన్సర్‌, గర్భాశయ కేన్సర్‌, బోన్‌ కేన్సర్లను ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్స చేయడానికి వీలుంటుంది.
సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ఎలాంటి చర్యలు తీసుకున్నారు?
జిల్లాలో సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా అన్ని రకాలైన జాగ్రత్తలు తీసుకుంటున్నాం. క్షేత్రస్థాయిలో ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు వ్యాధులు ప్రబలడానికి కారణాలను గుర్తించి సంరక్షణా చర్యలు చేపడుతున్నాం. జిల్లాలో దోమల బెడద అధికంగా ఉంటోంది. పరిసరాల పరిశుభ్రత లేని కారణంగా దోమలు వృద్ధి చెందుతున్నాయి. వీటివల్ల ప్రధానంగా ప్రాణాంతక వ్యాధులైన మలేరియా, డెంగీ, సెరిబ్రల్‌ మలేరియా, ఫైలేరియా వంటి వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఏటా దోమల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం. పారిశుధ్య నిర్వహణపై గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నాం. వీధుల్లో పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం. నేల బావులు, తాగునీటి పథకాలు, మురుగు నీటి నిల్వ కేంద్రాల వద్ద ప్రత్యేకంగా పారిశుధ్య పనులు చేయిస్తున్నాంన. ఎక్కడైనా నిర్లక్ష్యంగా ఉంటే తగిన చర్యలు తప్పవు.
జిల్లాలో మలేరియా, డెంగీ, విషజ్వరాల పరిస్థితి ఎలా ఉంది?
జిల్లాలో ప్రస్తుతం సీజనల్‌ వ్యాధులు అదుపులోనే ఉన్నాయి. వాతవరణంలో వస్తున్న మార్పుల వల్ల జ్వరాలు పెరిగే అవకాశం ఉంది. ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలి. వడకాచిన నీరు తాగడం, మితంగా తినడం, జ్వరం లక్షణాలు ఉన్నట్టు గుర్తిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంద్రించడం ద్వారా త్వరతిగతిన నయం చేసకోవచ్చు. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణలో కొన్ని లోపాలు ఉండడంతో దోమలు బెడద ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల జ్వరాల బారి పడతారు. వ్యక్తిగత పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోకపోతే వ్యాధులు తప్పవు. మలేరియా, డెంగీ వ్యాధులు దోమల నుంచే సంక్రమిస్తాయి. ప్రతిఒక్కరూ దోమల నివారణకు తగు జాగ్రత్తలు పాటించాలి. దోమల నుంచి సంరక్షణ పొందడానికి తగిన జాగ్రత్తలు పాటించాలి. డెంగీ, సెరిబ్రల్‌ మలేరియా వంటి వ్యాధుల బారిన పడితే రూ. లక్షలాదిగా ఖర్చు చేయాల్సి వస్తోంది.
మలేరియా నియంత్రణకు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు?
మలేరియా నియంత్రణకు జిల్లాలో హైరిస్క్‌ గ్రామాలను గుర్తించాం. దోమల నివారణకు తగిన చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే జిల్లాలో లక్షల సంఖ్యలో గంబూషియా చేపలను హైరిస్క్‌ ప్రాంతా ల్లో పెద్ద నీటి నిల్వలు ఉన్నచోట విడిచిపెట్టేందుకు చర్యలు చేపట్టాం. గిరిజన ప్రాంతాల్లో మలేరియా వ్యాప్తిని అరికట్టేందుకు దోమతెరలను ఏటా పంపిణీ చేస్తున్నాం. ఈ ఏడాదీ ముందస్తుగా జ్వరాలపై ప్రజలను అమ్రత్తం చేశాం. దోమలు కుట్టకుండా ఉండేందుకు పూర్తిగా వస్త్రధారణ తప్పని సరి. డెంగీ నిర్ధారణ పరీక్షలు ప్రభుత్వ సర్వజనాస్పత్రితో పాటు టెక్కలిలో ఉన్న కేంద్ర ఆస్పత్రిలోనే చేపడుతుంది. మలేరియా, డెంగీ రాకుండా ముందస్తు నివారణ చర్యలు పాటించడం మేలు.