
* జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు
ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్: జిల్లాలో సోమవారం నుంచి జరపతలపెట్టిన ఎపి పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై కలెక్టరేట్‌లో ఆదివారం సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 25 నుంచి అక్టోబరు 6 వరకు 11 రకాల పరీక్షలను నిర్వహించనున్నట్టు తెలిపారు. జిల్లా ప్రొబేషన్ అధికారి, టెక్నికల్ అసిస్టెంట్, అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్‌ఆఫ్ ఫిషరీస్, జూనియర్ ట్రాన్సలేటర్, ఇండిస్టియల్ ప్రమోషన్ ఆఫీసర్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్, సివిల్ అసిస్టెంట్ సర్జన్, ఫారెస్టు రేంజ్ ఆఫీసర్, నాన్ గజిటెడ్, గ్రూప్ 4 వంటి పరీక్షలున్నట్లు పేర్కొన్నారు. ఇవి పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ పరీక్షలని అన్నారు. ఎచ్చెర్లలోని శ్రీవెంకటేశ్వర, శ్రీశివాని ఇంజినీరింగ్ కళాశాలల్లో పరీక్షలు నిర్వహించనున్నట్టు చెప్పారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు రెండు షిఫ్ట్‌ల్లో పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు. అభ్యర్థులు పరీక్ష సమయానికి గంట ముందే హాజరుకావాలన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి అలసత్వం, అసౌకర్యం కలగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని తేల్చిచెప్పారు. అలాగే పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్, తాగునీరు, విద్యుత్ అంతరాయం లేకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. అభ్యర్థుల కొరకు ప్రత్యేక ఆర్‌టిసి బస్సులు నడపాలని ఆదేశించారు. ప్రతి ఒక్కరికీ గుర్తింపు కార్డులు తప్పనిసరిగా ఉండాలన్నారు. కేంద్రాల వద్ద ప్రథమ చికిత్స ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. అధికారులకు అప్పగించిన విధులను సమన్వయంతో సక్రమంగా నిర్వహించాలన్నారు. పరీక్షలు సజావుగా జరిగేలా చూడాలన్నారు. సమావేశంలో ఎపిపిఎస్‌సి అసిస్టెంట్ సెక్రెటరీ బి.సిహెచ్.కుమార్‌రాజు, సెక్షన్ ఆఫీసర్ డి.ప్రశాంత్‌కుమార్, అడిషనల్ ఎస్‌పి జె.తిప్పేస్వామి, ఎచెర్ల తహశీల్దార్ సత్యనారాయణ, హెచ్ సెక్షన్ పర్యవేక్షకులు శ్రీకాంత్, డిటిలు ఆర్.శ్రీనివాసరావు, త్రినాథరావు, వెంకటేశ్వర, శివానీ ఇంజినీరింగ్ కళాశాలల ప్రతినిధులు పాల్గొన్నారు.