Sep 13,2023 21:57

మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌

ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌: జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఆదేశించారు. ఉద్దానం కిడ్నీ రీసెర్చ్‌ కేంద్రంలో వైద్యుల నియామకం తదితర పనులు వేగవంతం చేయాలన్నారు. కలెక్టర్‌, ఉన్నతాధికారులతో సిఎం బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌ మాట్లాడుతూ గ్రామ, పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలో వైద్య శిబిరాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్య సమస్యలకు సంబంధించి ప్రతి ఇంటినీ సందర్శించి, ప్రతి వ్యక్తి ఆరోగ్య వివరాలను తెలుసుకునేందుకు వాలంటీర్లు, వైద్య సిబ్బంది ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు. ఈనెల 30 నుంచి వైద్య శిబిరాలు నిర్వహించేందుకు షెడ్యూల్‌ను ఖరారు చేశామన్నారు. జిల్లాలోని 594 సచివాలయాలతో పాటు 13 పట్టణ ఆరోగ్య కేంద్రాలకు మ్యాపింగ్‌ చేయనున్నట్లు చెప్పారు. ఈ పథకం కింద ఇంటింటికీ వాలంటీరు వెళ్లి ఆ కుటుంబంలోని ఆరోగ్య సమస్యలపై వివరాలు సేకరించి టోకెన్‌ ఇవ్వనున్నట్లు తెలిపారు. గ్రామంలో నిర్వహించే వైద్య శిబిరం తేదీపై ముందుగా అందరికీ తెలిసేలా ప్రచారం చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి శిబిరంలో ఇద్దరు వైద్యులు, స్పెషలిస్టు ఉండేలా చర్యలు చేపట్టామన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి బి.మీనాక్షి, ఆరోగ్యశ్రీ కో-ఆర్డినేటర్‌ ప్రకాశరావు, జిల్లా పంచాయతీ అధికారి వి.రవికుమార్‌, జిల్లా విద్యాశాఖ అధికారి కె.వెంకటేశ్వరరావు, ఐసిడిఎస్‌ పీడీ బి.శాంతిశ్రీ తదితరులు పాల్గొన్నారు.