Sep 21,2023 22:14

సమన్వయంతో పనిచేయండి: కలెక్టర్‌
ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌:
ఎన్నికల ప్రకియలో తహశీల్దార్‌ మొదలు బిఎల్‌ఓల వరకు ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమ నిబంధనలపై పూర్తి అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్‌ ఎస్‌.షన్మోహన్‌ తెలిపారు. గురువారం జిల్లా సచివాలయంలో కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌ పి.శ్రీనివాసులు జిల్లా రెవెన్యూ అధికారి ఎన్‌.రాజశేఖర్‌తో కలసి జిల్లాలోని ఆర్డీవోలు, మున్సిపల్‌ కమిషనర్లు, ప్రత్యేక అధికారులు, అన్ని మండలాల తహశీల్దార్లు, బిఎల్‌ఓలతో ఓటర్ల ప్రత్యేక సంక్షిప్త సవరణ జాబితా 2024కు సంబంధించిన అంశాలపై సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాల మేరకు పారదర్శకమైన ఓటర్ల జాబితా తయారీలో మండలస్థాయిలో తహశీల్దార్లు ప్రధానభూమిక పోషించడం జరుగుతుందని తెలిపారు. ఓటర్ల జాబితా తయారీలో భాగంగా ఇప్పటివరకు చేరికలు, తొలగింపులకు సంబంధించి అందిన క్లైయిమ్‌లలో ప్రతి క్లైయిమ్‌ను తహశీల్దార్‌ క్షుణ్ణంగా పరిశీలించాలని కలెక్టర్‌ ఆదేశించారు. అలాగే డెత్‌, షిఫ్టెడ్‌, రిపీటెడ్‌ ఓట్లను క్షుణ్ణంగా పరిశీలించాలని అన్నారు. ఓటర్ల జాబితా నుంచి తొలగించిన ఓట్లను బిఎల్వోలు పోలింగ్‌ స్టేషన్ల వారీగా తొలగించు ప్రక్రియలో అందుకు సంబంధించి సంబంధిత డాక్యుమెంట్లు ఉన్నది లేనిది మరొక మారు సరిచూసుకోవాలన్నారు. ఎన్నికల ప్రకియలో భాగంగా మండల స్థాయిలో తహశీల్దార్లు, డీటీ, ఆర్‌ఐ, సీనియర్‌ అసిస్టెంట్‌, బిఎల్‌ఓలు ఎన్నికల నియమావళికి సంబంధించి ప్రతి అంశంపై అవగాహన ఏర్పరచుకోవాలని తెలిపారు. వీరితో పాటు ఎంఈఓలు, సర్వేయర్‌,డిజిటల్‌ అసిస్టెంట్లతో మండలస్థాయి బందాలు, ఇదే విధంగా నియోజకవర్గస్థాయిలో కూడా బందాలు ఏర్పాటు కావాలన్నారు. జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ పి.శ్రీనివాసులు మాట్లాడుతూ.. 18 సంవత్సరాలు ఉన్న యువత తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు స్వీప్‌ యాక్టివిటీని ఇంజనీరింగ్‌, డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో ఓటర్ల జాబితాలో చేరికలు, తొలగింపు, షిఫ్టెడ్‌, డెత్‌ తదితర అంశాలకు సంబంధించి, పోలింగ్‌ స్టేషన్‌ల రేషనలైజేషన్‌ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈసమావేశంలో జడ్పీ సీఈఓ ప్రభాకర్‌ రెడ్డి, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి మధుసూదన్‌ రెడ్డి, పలమనేరు ఆర్‌డిఓ శివయ్య కలెక్టరేట్‌ ఏవో కులశేఖర్‌, ఎలక్షన్స్‌ సెల్‌ సూపరింటెండెంట్‌, మున్సిపల్‌ కమిషనర్లు, వివిధ మండలాల తహశీల్దార్లు పాల్గొన్నారు.