Sep 19,2023 22:26

సమ్మెటతో దాడి
ఒకరు మృతి - మరొకరికి పరిస్థితి విషమం
ప్రజాశక్తి -గంగాధర నెల్లూరు:
ఇద్దరు వ్యక్తులపై సమ్మెటతో దాడి చేయగా ఒకరు చనిపోగా, మరొకరు తీవ్రగాయాలకు గురై ఆసుపత్రి పాలైన సంఘటన సోమవారం అర్ధరాత్రి జరిగింది. ఎస్‌ఐ కథనం మేరకు వివరాలు ఉన్నాయి. గంగాధర నెల్లూరు మండలం చెర్లోపల్లిలో వద్దగల కావేరి గ్రానైట్స్‌లో రాజస్థాన్‌కు చెందిన సతీష్‌, భావర్‌ సింగ్‌, అస్సాంకు చెందిన లోకిరామ్‌ ముర్ము, ఛత్తీస్గఢ్‌కు చెందిన రాజురామ్‌ కూలీలుగా పనిచేస్తున్నారు. వీరిలో భావర్‌ సింగ్‌ రోజూ మద్యం తాగి వచ్చి మిగిలిన వ్యక్తులతో తరచు భోజనం సమయాల్లో గొడవలు పడుతుండేవాడు. అయితే సోమవారం భావర్‌ సింగ్‌ని సతీష్‌, లోకిరామ్‌ ముర్ములు తిట్టారు. అది మనసులో పెట్టుకొని లోకిరామ్‌ ముర్ము, సతీష్‌ల నిద్రిస్తున్న సమయంలో వారిపై సోమవారం అర్ధరాత్రి ఫ్యాక్టరీలో వాడే సమ్మెటతో తలపై తీవ్రంగా కొట్టాడు. ఈఘటనలో వారికి తీవ్రమైన గాయాల కావడంతో 108 అంబులెన్స్‌లో చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే లోకిరామ్‌ ముర్ము మతి చెందగా, సతీష్‌ను వేలూరు ఆసుపత్రికి తరలించారు. కూలి రాజురామ్‌ ఫిర్యాదు మేరకు ఇన్‌ఛార్జి ఎస్‌ఐ ఉమామహేశ్వర్‌ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.