Jul 13,2022 22:47

సమ్మెను ఉధృతం చేస్తాం
3వ రోజుకు చేరిన పారిశుధ్యకార్మికుల సమ్మె
కళ్లకు గంతలతో నిరసన
మద్దతు తెలిపిన సిఐటియు
ప్రజాశక్తి - కుప్పం, పలమనేరు, చిత్తూరు అర్బన్‌

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయడంతో పాటు కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని, ప్రభుత్వ మొండి వైఖరి మారకుంటే సమ్మెను మరింత ఉధృతం చేస్తామనిమున్సిపల్‌ కార్మికుల స్పష్టం చేశారు. కుప్పం మున్సిపల్‌ కార్యాలయం ఎదుట మూడవరోజు కార్మికులు విధులను బహిష్కరించి నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తామేమి గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్‌ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో మాట తప్పని మడమ తిప్పని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి పూర్తిగా విఫలం చెందారని యూనియన్‌ అధ్యక్షుడు గోవిందరాజు, కార్యదర్శి సి.పార్థిభన్‌ విమర్శించారు. ఏళ్లతరబడి పారిశుధ్యాన్ని మెరుగుపరచడంలో కీలకపాత్ర పోషిస్తున్న మున్సిపల్‌ కార్మికుల సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. సచివాలయ ఉద్యోగులకో న్యాయం మున్సిపల్‌ కార్మికులకు న్యాయం అంటే సహించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మున్సిపల్‌ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపాలని, లేనిపక్షంలో కార్మికుల సమస్యల పరిష్కారానికై అవసరమైతే నిరవధికసమ్మె చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో నరసింహులు, భరత్‌, గుణశేఖర్‌, మంజుమ్మ, హేమవతి, వెంకటేష్‌, తదితరులు పాల్గొన్నారు.
చిత్తూరులో..
సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులు చేపట్టిన సమ్మె బుధవారం మూడో రోజుకు చేరుకుంది. గాంధీ విగ్రహం నుండీ మున్సిపల్‌ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి కళ్లకు గంతలు కట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా మున్సిపల్‌ కార్పొరేషన్‌ వర్కర్స్‌ యూనియన్‌ గౌరవాధ్యక్షులు యస్‌.నాగరాజు మాట్లాడుతూ మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం, ఇంజనీరింగ్‌ విభాగంలో పనిచేస్తున్న కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గత 3 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లో నిరవధిక సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వానికి కళ్లు కనపడలేదా అని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. 3వ రోజు జరిగిన సమ్మె సందర్భంగా మున్సిపల్‌ కార్మికులు కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు. మున్సిపాల్‌ వర్కర్స్‌ యూనియన్‌ సలహాదారులు గోపీనాథ్‌, మణి, ఏఐటీయూసీ నాయకులు సత్యమూర్తి, నాగరాజు నాయుడు విజరుకుమార్‌, గిడ్డుబారు, రఘు, యూనియన్‌ నాయకులు విజయకుమార్‌, చంద్ర, నాగరాజు, దొరస్వామి, వరలక్ష్మి, రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.
పలమనేరులో..
మున్సిపల్‌ కార్మికుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గిరిధర్‌ గుప్తా, రైతు సంఘం జిల్లా నాయకులు ఓబుల్‌రాజు డిమాండ్‌ చేశారు. మున్సిపల్‌ కార్మికులు రాష్ట్ర యూనియన్‌ పిలుపుమేరకు పలమనేరు పట్టణంలో గత మూడు రోజూ కొనసాగిన మున్సిపల్‌ కార్మికుల సమ్మెకు బుధవారం సిఐటియు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారంతోపాటు జీతాలు, వేతనాల పెంపు, పీఆర్సీ అమలు, ఆదివారం సెలవు వంటి డిమాండ్లపై ఉన్నతాధికారులతో చర్చిస్తున్నా, సానుకూల స్పందన రాకపోవడంతో సమ్మెలోకి వెళ్లాల్సి వచ్చిందన్నారు. 11వ పీఆర్సీ ప్రకారం నెలకు రూ.20వేలు జీతం ఇవ్వాలని, డీఏ ఇవ్వాలని కోరుతున్నారు. మున్సిపల్‌ పారిశుద్ధ్య కార్మికులను క్రమబద్ధీకరించాలని, విస్తరిస్తున్న పట్టణాలు, నగరాలకు అనుగుణంగా కార్మికులసంఖ్యను పెంచాలని డిమాండ్‌ చేశారు. కెవిపిఎస్‌ జిల్లా అధ్యక్షులు ఈశ్వర్‌, ఏఐటియుసి నాయకులు సుబ్రహ్మణ్యం, రాజా, జయంతి, మున్సిపల్‌ వర్కర్స్‌ పాల్గొన్నారు.