సమ్మె విరమించే ప్రసక్తే లేదు..
తెగేసి చెప్పిన పవర్లూమ్ కార్మికులు, సిఐటియు నాయకులు
ప్రజాశక్తి- నగరి: నగరిలో మాజీముఖ్యమంత్రి, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు పర్యటనున్న సందర్భంగా పవర్లూమ్ కార్మికులు చేపట్టిన సమ్మెను విరిమింపజేసందుకు అధికారపార్టీ నాయకులు తహశీల్దార్‌తో సహా ఇతర అధికార యంత్రాంగం రకరకాలుగా సిఐటీయు నాయకులను మభ్యపెట్టే ప్రయత్నాలు చేశారు. కానీ తమకు కూలి రేట్లును పెంచేత వరకు సమ్మెను విరిమించే ప్రసక్తే లేదని అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు పెరుమాళ్, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.చైతన్య స్పష్టం చేశారు. కూలి రేట్లు పెంచాలని కోరుతూ పవర్లూమ్ కార్మికులు చేపట్టిన సమ్మె గురువారం మూడో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా శిబిరం వద్దరకు మరమగ్గం కార్మికుల కుటుంబంలోని మహిళలు, పిల్లలు చేరుకుని సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టిడిపి నగరి నియోజకవర్గ ఇన్‌ఛార్జి భానుప్రకాష్ సమ్మె శిబిరం వద్దకు చేరుకుని కార్మికులకు సంఘీభావం తెలిపారు. ఆయన మాట్లాడుతూ ప్రతిరోజు చమటోడ్చినా కూడా తమ శ్రమకు తగిన కూలి రాకపోవడంతో నేడు మరమగ్గం కార్మికులు సమ్మె చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. టిడిపి కార్మికులకు అండగా ఉంటుందని తెలిపారు. అలాగే జనసేన నాయకులు గోపి రాయల్, పవర్ రామచంద్రన్, కృష్ణ సమ్మెకు మద్దతు తెలిపారు. ఈ సమ్మెలో అసోసియేషన్ సభ్యులు షణ్ముగం, జగదీష్, గణపతి, నక్కీరన్, యువరాజ్, 2000 మంది మరమగ్గం కార్మికులు పాల్గొన్నారు.










