ప్రజాశక్తి - చిత్తూరుఅర్బన్
చిత్తూరు నగర అభివృద్ధి కోసం కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు సమిష్టిగా కృషి చేద్దామని నగర మేయర్ ఎస్ అముద పిలుపునిచ్చారు. మేయర్ అధ్యక్షతన చిత్తూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ అత్యవసర సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ... నగరపాలక సంస్థ పరిధిలో ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని... మున్ముందు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడానికి సభ్యులంతా సమన్వయంతో కలిసికట్టుగా పని చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలును చేపడుతున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా నగర కమిషనర్ డా. జె అరుణ మాట్లాడుతూ సభ్యులు ప్రస్తావించిన సమస్యలను సకాలంలో పరిష్కరించేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుందని కమిషనర్ వివరించారు. స్థానిక సమస్యలు, ఇతర ప్రశ్నావళిని సభ్యులు ముందస్తుగా ప్రతిపాదనలుగా పంపిస్తే.. అందుకు తగిన చర్యలు తీసుకొని సభలో సభ్యులకు వివరించడం జరుగుతుందని చెప్పారు. సభలో కార్పొరేటర్లు విన్నవించిన సమస్యలపై నగర కమిషనర్ డా. జె అరుణ, సంబంధిత శాఖల అధికారులు సమాధానాలు ఇచ్చారు. సభలో పలు అజెండా అంశాలపై డిప్యూటీ మేయర్లు ఆర్ చంద్రశేఖర్, రాజేష్ కుమార్ రెడ్డి, ఇతర కార్పొరేటర్లు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. పలు అంశాల పైన చర్చించారు.
అత్యవసర సమావేశంలో సభ ఆమోదించిన అంశాలు...
- జిల్లా కలెక్టర్, ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ వారి లేఖ మేరకు పిల్లలకు స్కేటింగ్ రింక్ నిర్మాణానికి సంతపేట పీఎస్సీ స్కూల్లో 0.50 ఎకరం స్థలాన్ని కేటాయించడానికి సభ్యులు ఆమోదించారు.
- నగరపల్లె సంస్థ పరిధిలో ఘన వ్యర్ధాల నిర్వహణలో భాగంగా డంపింగ్ యార్డ్ లో లెగసి వేస్ట్ బయోమైనింగ్, రేమిడేషన్ ద్వారా తొలగించడానికి టెండర్ తగ్గించుకున్న కంపెనీకి పని ఉత్తర్వులు జారీ చేయడం.
- పురపాలక పరిపాలన శాఖ వారి సర్కులర్ మేరకు 15వ ఆర్థిక సంఘం టైడ్ గ్రాండ్, అన్ టైడ్ 2021-22 సంవత్సరానికి సంబంధించి మంజూరు చేసిన మొత్తము రూ.11,70,77,554 వార్షిక అభివద్ధి ప్రణాళికను ప్రభుత్వం వారి ఆమోదానికి పంపడం.
- నగరపాలక సంస్థ గాండ్లపల్లి ఉన్నత పాఠశాల అదనపు తరగతి గదుల నిర్మాణం కోసం కొంగారెడ్డిపల్లి పూల మార్కెట్ వద్దనున్న స్థలం కేటాయింపు విషయమై నిబంధనలు పరిశీలించి.. చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
- టేబుల్ అజెండాగా.. నేషనల్ క్లీన్ ఎయిర్ పోగ్రామ్ లో భాగంగా నగరంలోని కూడళ్లు అభివద్ధి, పచ్చదనం పెంపొందించడం, కాలుష్య నియంత్రణ కోసం ప్రతిపాదించిన పనులను ఆమోదించారు.
- నగరపాలక కార్యాలయంలో జూనియర్ అకౌంటెంట్ గా నిర్వహిస్తున్న కే. కుమార్ కు సీనియర్ అకౌంటెంట్ గా పదోన్నతి కల్పించడం.
- కొంగారెడ్డిపల్లి పూల మార్కెట్ సముదాయం వెనుక ఉన్న ఖాళీ స్థలం లీజు కేటాయింపు కోసం చేపట్టిన టెండర్లలో ఎల్. వన్ గా నిలిచిన హిమజ ఇండియన్ గ్యాస్ ప్రొప్రైటర్ వారి టెండర్ను ఆమోదించడం.










