Sep 20,2023 22:35

ఇన్‌ఛార్జి కలెక్టర్‌ నవీన్‌కు సమస్యలను వివరిస్తున్న ప్రజలు

* అధికారులకు ఇన్‌ఛార్జి కలెక్టర్‌ నవీన్‌
* అధిక సంఖ్యలో తరలివచ్చిన అర్జీదారులు
ప్రజాశక్తి - రణస్థలం: 
జగనన్నకు చెబుదాం (స్పందన) కార్యక్రమంలో వచ్చిన సమస్యలపై మండలస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు అన్ని విభాగాల అధికారులు ప్రత్యేక దృష్టిసారించినప్పుడే అర్జీదారుల సమస్యలు పరిష్కారమవుతాయని ఇన్‌ఛారిజ కలెక్టర్‌ ఎం.నవీన్‌ అధికారులకు సూచించారు. ఎంపిడిఒ కార్యాలయంలో ఇన్‌ఛార్జి కలెక్టర్‌ ఆధ్వర్యాన నిర్వహించిన జగనన్నకు చెబుదాం (స్పందన) కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఉదయం 10.15 గంటల నుంచి మధ్యాహ్నం 1.45 గంటల వరకు నిర్వహించిన కార్యక్రమంలో వందలాది మంది అర్జీదారులు వచ్చి తమ గోడును వినిపించుకున్నారు. సమస్యలను సావధానంగా వింటూ వాటికి పరిష్కారమార్గం చూపుతూ అర్జీలను సంబంధిత అధికారులకు అందజేసి నిర్ణీత గడువులో పరిష్కరించాలని నవీన్‌ ఆదేశించారు. ఎచ్చెర్ల నియోజకవర్గం పరిధిలోని ఎచ్చెర్ల, రణస్థలం మండలాల్లోని మత్స్యకారులు వర్షాలు, తుపాన్లు, పిడుగులు సంభవించిన సమయంలో సముద్రంలో చేపల వేటకు మత్స్యకారులు వెళ్లలేకపోతున్నారని టిడిపి నాయకులు కలిశెట్టి అప్పలనాయుడు చెప్పారు. ఇటువంటి సమయంలో సముద్రంలో వేటకు వెళ్లలేక మత్స్యకారులు జీవనోపాధిని కోల్పోతున్నారని, వారిని ఆదుకోవాలని కోరారు. ఎచ్చెర్ల నియోజకవర్గ పరిధిలో రణస్థలం, లావేరు, జి.సిగడాం, ఎచెర్ల మండలాల్లో విస్తరించి ఉన్న పంట కాలువల ద్వారా ఆయా ఆయకట్టు భూములకు సకాలంలో సాగునీరు సరఫరా చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. రణస్థలం, లావేరు, జి.సిగడాం మండలాల్లో విస్తరించి ఉన్న తోటపల్లి రిజర్వాయర్‌, మడ్డువలస ప్రాజెక్టులకు చెందిన పంట కాలువల ద్వారా ఆయకట్టు భూములకు సకాలంలో సాగునీరు సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో ప్రతి సోమవారం నిర్వహించే స్పందనకు రావడం వల్ల ఖర్చు, సమయం ప్రజలకు ఆదా అవుతుందని భావించి రణస్థలం వచ్చి ప్రత్యేకంగా స్పందన కార్యక్రమం ఏర్పాటు చేశామని తెలిపారు. రెవెన్యూకు సంబంధించిన సమస్యలపై అర్జీలు ఎక్కువగా వచ్చాయన్నారు. హౌసింగ్‌, కొవ్వాడ అణు విద్యుత్కేంద్రం, భూ సమస్యలు, గ్రామాల్లో రోడ్లు, కాలువలు తదితర వాటిపై కూడా వినతులు వచ్చాయన్నారు. ముఖ్యంగా మండల స్థాయిలో సమస్యలు మండలస్థాయి అధికారులు స్పందించి పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో ఎఎస్‌పి టి.పి విఠలేశ్వరరావు, ఆర్‌డిఒ బి.శాంతి, ఎన్నికల అధికారి మురళీకృష్ణ, డిఆర్‌డిఎ పీడీ విద్యాసాగర్‌, రణస్థలం ప్రత్యేక అధికారి దుర్గారావు, తహశీల్దార్‌ సనపల కిరణ్‌కుమార్‌, ఎంపిడిఒ రమణమూర్తి, ఆర్‌డబ్ల్యుఎస్‌ డిఇ సూర్యనారాయణ, ఎంఇఒలు ఎ.త్రినాథరావు, బి.లావణ్య పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.