Sep 10,2023 21:27

సమగ్ర శిక్ష అభియాన్‌లో పనిచేస్తున్న ఉద్యోగులకు మద్దతు తెలుపుతున్న యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు

         ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌   సమగ్ర శిక్ష అభియాన్‌లో పనిచేస్తున్న కాంటాక్టు, ఔట్‌సోర్సింగ్‌, పార్ట్‌ టైం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు. సమగ్ర శిక్ష, కేజీబీవీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌, పార్ట్‌ టైమ్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కోసం ఆదివారం కలెక్టరేట్‌ వద్ద చేపట్టిన నిరసన దీక్షకు యుటిఎఫ్‌ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం వేతనాలు పెంచి 15 నెలలు గడుస్తున్నా పెంచిన వేతనాలు ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. వెంటనే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, విద్యాశాఖలో పని చేస్తున్న వారందరినీ రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ జిల్లా గౌరవాధ్యక్షులు ఎస్‌వి.రమణయ్య, సత్యసాయి జిల్లా అధ్యక్షులు జయచంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎం.సుధాకర్‌, గౌరవాధ్యక్షులు భూతన్న తదితరులు పాల్గొన్నారు.