అర్బన్ ఎస్‌పి వెంకటప్పల నాయుడు
ప్రజాశక్తి- తిరుపతి సిటి
స్థానిక ఎస్‌వి సెనేట్‌హాల్‌లో క్రైమ్ రివ్యూ సమీక్షలను శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌పి మాట్లాడుతూ అర్బన్ పోలీసు జిల్లాలో చాలామంది పోలీసు అధికారులు తాము చేస్తున్న పని ఎవరికీ తెలియడం లేదన్న భ్రమలో, చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. శాఖాపరమైన చర్యలు తీసుకోవడానికి ముందే అటువంటి వారు తమ విధానాన్ని మార్చుకోవాలని ఎస్‌పి సూచించారు. కొందరు అవినీతి అధికారులు సిబ్బంది కారణంగా మొత్తం పోలీసు వ్యవస్థపైన ప్రజల్లో విశ్వాసం కోల్పోయే ప్రమాదం ఉందని, వ్యవస్థలు దెబ్బతీసే ఎటువంటి పనికైనా దూరంగా ఉండాలని, పోలీసు వ్యవస్థపై సమాజంలో గౌరవం పెంపొందేలా ప్రతి ఒక్కరు వ్యవహరించాలని కోరారు. పోలీసు విభాగం అంటే ప్రజలలో గౌరవం, విశ్వాసం ఉందని, దానిని చెడగొట్టకుండా ప్రతి అధికారి కిందిస్థాయి సిబ్బంది నిబద్ధతతో విధులు నిర్వహించి ఆగౌరవాన్ని మరింత ఇనుమడింప చేయాలన్నారు. మహిళల సంరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన దిశా మొబైల్ యాప్‌పై మరింతగా అవగాహన కల్పిస్తూ, ప్రతి ఒక్క మహిళ మొబైల్ ఫోన్‌లో ఈ యాప్‌ని డౌన్లోడ్ చేసుకునే విధంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. గతంలో ఎన్నో కేసులను, దొంగతనాలకు సంబంధించి, ఇతరత్రా కేసులను పరిష్కరించిన అనుభవంతో, నేరాలు పునరావతం కాకుండా చర్యలు తీసుకోవలన్నారు. కోర్టు నుంచి నానె బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన కేసులను త్వరితగతిన పరిష్కరించి, ముద్దాయిలను అరెస్టు చేసి కోర్టు ముందు హాజరు పరిచేలా చర్యలు చెప్పట్టలన్నారు. నగరంలో, నగరం వెలుపల హైవేల పైన ప్రమాదాలను తరచుగా జరిగే ప్రాంతాలను గుర్తించి, వాటి నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుత సమయంలో నేరాలు ఎక్కువగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆధారం చేసుకుని పరిష్కరించ బడుతున్నాయని అన్నారు. కావున నగరంలో వ్యాపార సంస్థల వద్ద, నివాసాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకొని నేర నియంత్రణకు సహకరించేలా ప్రజలను చైతన్యవంతులను చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలో ర్యాగింగుకు వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ, ర్యాగింగ్ వలన కలిగే దుష్ఫలితాలను విద్యార్థులకు తెలియజేయండని తెలిపారు. సమావేశంలో అడిషనల్ ఎస్‌పిలు ఇ.సుప్రజ, అరిఫుల్లా, జిల్లాలోని డిఎస్‌పిలు, సిఐలు, ఆర్‌ఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.










