Apr 16,2023 21:58

తొలి తెలుగు నాటకకర్త కందుకూరి
నాటకరంగ దినోత్సవంలో కత్తుల రామ్మోహన్‌రావు
ప్రజాశక్తి - పాలకొల్లు

సకల కళల సమాహారం నాటకం అని పాలకొల్లు నటీనట సంక్షేమ సమాఖ్య అధ్యక్షులు కత్తుల రామ్మోహన్‌రావు అన్నారు. సమాఖ్య ఆధ్వర్యంలో తెలుగు నాటకరంగ దినోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. సంస్థ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గుడాల హరిబాబు సభకు స్వాగతం పలుకగా తొలి తెలుగు నాటకరంగ రూపశిల్పి కందుకూరి వీరేశలింగం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సభాధ్యక్షులు కత్తుల రామ్మోహన్‌రావు మాట్లాడుతూ తొలి తెలుగు నాటకం 'వ్యవహార ధర్మబోధిని' ప్రదర్శనకు (1880) ఆద్యుడు వీరేశలింగం అని, తెలుగు నాటకరంగానికి ఆయన పితామహుడు అని చెప్పారు. ఆయన సేవలకు గుర్తింపుగా ఆయన జన్మదినం ఏప్రిల్‌ 16న తెలుగు నాటక రంగ దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. ఈ సందర్భంగా సీనియర్‌ కళాకారుడు శివాల రామారావును ఘనంగా సత్కరించారు. విశ్రాంత కళాశాల ప్రిన్సిపల్‌ చేగొండి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ తెలుగు నాటకరంగం నాడు- నేడు గురించి వివరించారు. కార్యక్రమంలో ఉన్నమట్ల కపర్ది, రాజా తాతయ్య, కొల్లు నరసింహామూర్తి, సారిక రామచంద్రరావు, పుత్సల నాగలింగేశ్వరరావు, జాగు సత్యనారాయణ, పఠాన్‌ ఖలేశావలి, మామిడిశెట్టి శ్రీనివాస్‌, కోలాటి పెడ్డిరాజు, జిఎస్‌ఎన్‌.రవి, మాదిరెడ్డి శ్రీనివాస్‌, అంబటి రాజు మాట్లాడారు.