Apr 30,2023 09:07

ఆత్మకూరులో బ్యాంకు మేనేజర్‌కు వినతిపత్రం సమర్పిస్తున్న ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యురాలు సావిత్రమ్మ, తదితరులు

           ఉరవకొండ:అసలు, వడ్డీ కట్టించుకోకుండా స్కెల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం రైతులకు పంట రుణాలు పెంచి రెన్యువల్‌ చేయాలని కౌలు రైతుసంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బాలరంగయ్య, రంగారెడ్డి డిమాండ్‌ చేశారు. ఈమేరకు శనివారం విడపనకల్‌ మండల పరిధిలోని పాల్తూరులో ఉన్న గ్రామీణ బ్యాంక్‌ మేనేజర్‌ని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఖరీఫ్‌ సీజన్‌లో అతివృష్టి, అనావృష్టి వల్ల రైతులు సాగుచేసిన పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. కనీసం పశుగ్రాసం కూడా దొరకని పరిస్థితి అన్నారు. కావున మార్ట్‌గేజ్‌తో సంబంధం లేకుండా రైతులకు పంట రుణాలు రూ.5లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఎస్‌బిఐ అకౌంట్‌, కెసిసి అకౌంట్‌కు ప్రత్యేక పాస్‌ బుక్‌లిచ్చి ఎంట్రీలు నమోదు చేయాలన్నారు. బ్యాంకుల వద్ద తాగునీటితోపాటు నీడ ఉండే విధంగా ఏర్పాటు చేయాలన్నారు. అడంగల్‌ లేకుండా వన్‌బి ఆధారంగా రైతులకు పంట రుణాలు ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు బసన్న గౌడ్‌, గోవిందప్ప, కుబేర, రవికుమార్‌, తదితరులు పాల్గొన్నారు.
ఆత్మకూరు : అసలు, వడ్డీ కట్టించుకోకుండా స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం పెంచి పంట రుణాలను రెన్యువల్‌ చేయాలని ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యురాలు సావిత్రమ్మ డిమాండ్‌ చేశారు. ఈమేరకు ఎపి రైతుసంఘం ఆధ్వర్యంలో శనివారం మండల కేంద్రంలోని కెనరా బ్యాంకు మేనేజర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ఖరీఫ్‌లో జిల్లాలో నెలకొన్న అతివృష్టి, అనావష్టి కారణంగా పంటలు పూర్తిగా నష్టపోయారన్నారు. ఎక్కువ శాతం పొలాల్లోనే మొలకెత్తి దిక్కుతో స్థితిలో రైతులు ఉన్నారన్నారు. కనీసం పెట్టుబడి కూడా రాని పరిస్థితి నెలకొందన్నారు. కావున ప్రభుత్వ స్పందించి రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీతోపాటు బీమా వర్తించేలా చూడాలన్నారు. అంతేగాకుండా అసలు, వడ్డీ కట్టించుకోకుండా రుణాలు రెన్యువల్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి శివశంకర్‌, ఎన్‌పిఆర్‌డి మండల కార్యదర్శి రామయ్య, ఐద్వా జిల్లా సహాయ కార్యదర్శి కృష్ణవేణి, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి జయమ్మ, వెంకటమ్మ, తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం కలెక్టరేట్‌ : రైతులు బ్యాంకుల్లో తీసుకున్న పంట రుణాలకు అసలు వడ్డీ లేకుండా స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం రుణాలు పెంచి రెన్యూవల్‌ చేయాలని రైతు సంఘం జిల్లా నాయకులు టి.రామాంజినేయులు డిమాండ్‌ చేశారు. శనివారం మన్నిల రైతులతో కలిసి రైతు సంఘం ఆధ్వర్యంలో టవర్‌క్లాక్‌ వద్ద ఉన్న కెనరాబ్యాంక్‌లో అసిస్టెంట్‌ మేనేజర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరువు జిల్లాలో రైతులు ఇబ్బందులు పడుతున్న దృశ్య పంట రుణాలు పెంచి రెన్యూవల్‌ చేయాలని కోరారు. మార్టిగేజ్‌ లేకుండా రూ.5 లక్షల వరకు రుణాలు ఇవ్వాలన్నారు. ఎస్‌బి. అకౌంట్‌, కెసిసి అకౌంట్‌కు ప్రత్యేకంగా అకౌంట్‌ బుక్కులు ఇచ్చి, ఎంట్రీలు రెగ్యులర్‌గా నమోదు చేయాలన్నారు. బ్యాంకుల వద్ధ తాగునీరు, నీడ ఏర్పాటు చేయాలన్నారు. అడంగల్‌ లేకుండా 1 బి ఆధారంగా పంట రునాలు రెన్యూవల్‌ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు మునయ్య, పుష్పరాజు, చంద్రశేఖర్‌, భాగ్యలక్ష్మి, తిరుపాలు, దివాకర్‌ నాయుడు, రాము, లక్కప్ప తదితరులు పాల్గొన్నారు.