Apr 25,2023 22:15

కెనరా బ్యాంకు అధికారికి వినతిపత్రం సమర్పిస్తున్నఎపి రైతుసంఘం నాయకులు, రైతులు

        ప్రజాశక్తి-ఆత్మకూరు  రైతుల నుంచి అసలూ, వడ్డీ కట్టించుకోకుండా స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం రైతు పంట రుణాలను రెన్యువ ల్‌ చేయాలని ఎపి రైతుసంఘం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈమేరకు మంగళవారం మండల కేంద్రంలోని కెనరా బ్యాంకు వద్ద ఎపి రైతుసంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతేడాది జిల్లాలో ఎక్కువగా కురిసిన వర్షాలతోపాటు అకాల వర్షాలతో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. చాలామంది రైతులు పంటలు సాగు చేసేందుకు బయటి వ్యక్తుల నుంచి కూడా వడ్డీలకు డబ్బులు తెచ్చి పెట్టుబడులు పెట్టారన్నారు. ఈనేపథ్యంలో పెట్టిన పెట్టుబడులు సైతం రాలేదన్నారు. కావున బ్యాంకుల్లో అసలు, వడ్డీ కట్టించుకోకుండా స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం పంట రుణాలు పెంచి ఎకరాకు రూ.45 వేలు చేసి రెన్యువల్‌ చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. సిపిఎం మండల కార్యదర్శి శివశంకర్‌ మాట్లాడుతూ స్కేల్‌ ఫైనాన్స్‌ ప్రకారం రుణాలు పెంచి రెన్యువల్‌ చేయాలని, మర్డర్‌ కేసు లేకుండా రూ.10 లక్షల రుణం ఇవ్వాలని కోరారు. అలాగే బ్యాంకు వద్ద తాగునీరు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రైతుసంఘం మండల కార్యదర్శి రాము, ఆవాజ్‌ నాయకులు వలి, సిఐటియు మండల కార్యదర్శి జయమ్మ, ఐద్వా నాయకురాళ్లు సరస్వతమ్మ, వెంకటమ్మ, రైతులు పాల్గొన్నారు.