Jul 25,2022 22:43

ప్రజాశక్తి వార్తకు స్పందన
సకాలంలో నూతన భవన నిర్మాణాన్ని పూర్తి చేయండి
డిస్టిక్‌ ప్రాజెక్టు మేనేజ్మెంట్‌ అధికారి డాక్టర్‌ శ్రీనివాసరావు
ప్రజాశక్తి- యాదమరి:
మండల కేంద్రంలోని సంత గేటులో నత్తనడకన సాగుతున్న పీహెచ్‌సీ శీర్షిక సోమవారం ప్రజాశక్తి దినపత్రికలు ప్రచురితమైనది. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆదేశాల మేరకు.. యాదమరిలో నూతనంగా చేపట్టిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవన నిర్మాణాన్ని సోమవారం డిపిఎంఓ డాక్టర్‌ శ్రీనివాసరావు ఆర్‌బిఎస్‌కే జిల్లా కోఆర్డినేటర్‌ డాక్టర్‌ సుదర్శన్‌లో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కాంట్రాక్టర్‌తో మాట్లాడుతూ నిర్దేశించిన సమయంలోపు భవననిర్మాణాన్ని పూర్తిచేసి తమకు అందించాలని ఆదేశించారు. సంవత్సరకాలం పైబడిన బేస్మెంట్‌ లెవల్‌కే నిర్మాణపనులు జరుగుతుండడానికి చూసి వారు అసహనం వ్యక్తం చేశారు. భవననిర్మాణంలో అలసత్వం వహిస్తే సహించేది లేదని సకాలంలో నిర్మాణ పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో జరుగుతున్న నెలవారి సమావేశాన్ని డిపిఎంఓ డాక్టర్‌ శ్రీనివాస్‌రావు, ఆర్‌బిఎస్‌కే జిల్లా కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ సుదర్శన్‌ సమీక్షించారు. ఈసందర్భంగా డాక్టర్‌ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎంఎల్‌హెచ్‌పిలు, సబ్‌ సెంటర్‌కే పరిమితం కాదని ఆరోగ్య ఉపకేంద్ర పరిధిలో ప్రతినిత్యం అన్ని గ్రామాల్ని సందర్శించాలని అన్నారు. మహిళా ఆరోగ్య కార్యకర్తలు వారికి కేటాయించిన లక్ష్యాలను 100శాతం పూర్తి చేయాలన్నారు. సమావేశంలో కమ్యూనిటీ హెల్త్‌ఆఫీసర్‌ సిహెచ్‌ లక్ష్మీనారాయణ, యాదమరి వైద్యాధికారి జ్యోతి, హెల్త్‌ సూపర్వైజర్‌ సుగుణ ఏఎన్‌ఎంలు పాల్గొన్నారు.