అనంతపురం కలెక్టరేట్ : సమాచార హక్కు చట్టం కింద సమాచారం కోరుతూ అధికారులకు అందే దరఖాస్తులను సెక్షన్ 6(1) కింద సకాలంలో సమాచారాన్ని అందించాలని రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్ యు.హరిప్రసాద్ రెడ్డి అధికారులకు సూచించారు. మంగళవారం ఉదయం అనంతపురం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫెరెన్సు హాల్లో రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్ కలెక్టర్ ఎమ్.గౌతమి, ఎస్పీ కంచి శ్రీనివాసరావు, జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్‌లతో కలిసి ఆర్డీఐ దరఖాస్తులపై సమీక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం- 2005 మేరకు ప్రజలు కోరుతున్న సమాచారాన్ని సకాలంలో పారదర్శకతతో అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రత్యేకించి దరఖాస్తుదారుడు కోరుతున్న సమాచారం సిద్ధంగా ఉన్నప్పుడు సెక్షన్ 6(1) లో సూచించిన 30 రోజుల సమయం కోసం వేచి చూడకుండా సమాచారాన్ని అందించాలన్నారు. ప్రస్తుతం ఉన్న సాంకేతికతను ఉపయోగించుకుని ప్రభుత్వ కార్యాలయాల రికార్డులను డిజిటలైజ్ చేసేందుకు ప్రయత్నించాలన్నారు. సెక్షన్ 19(1)19(3) కింద దరఖాస్తులను కమిషన్ చురుగ్గా పరిష్కరించడంతో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉన్నామని, భారతదేశంలో మూడవ స్థానంలో నిలిచామన్నారు. కలెక్టర్ గౌతమి మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం వచ్చినప్పటి నుంచి సకాలంలో దరఖాస్తుదారులు కోరిన సమాచారాన్ని అందిస్తున్నట్లు చెప్పారు. ఎప్పటికప్పుడు 4(1b) తాజా సమాచారాన్ని అప్లోడ్ చేస్తున్నామన్నారు. జిల్లాలో కూడా సమాచార హక్కు చట్టంపై అవగాహన కల్పించామన్నారు. ప్రజా ప్రయోజనాల దష్ట్యా సమాచారం అందుబాటులో ఉంచి ప్రజలకు అందించేందుకు కషి చేస్తామన్నారు. ఎస్పీ శ్రీనివాస రావు మాట్లాడుతూ పోలీస్ శాఖలో సమాచార హక్కు చట్టం దరఖాస్తులను సకాలంలో పరిష్కరిస్తున్నామని తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకించి అదనపు ఎస్పీని నోడల్ అధికారిగా నియమించామన్నారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ కుశాల్ జైన్, డిఅర్‌ఒ గాయత్రి దేవి, కలెక్టరేట్ ఏవో విజయలక్ష్మి, అన్సెట్ సిఇఒ కేశవ నాయుడు, ఆర్డీవో మధుసూదన్, డీఆర్డీఏ, డ్వామా పీడీ పీడీలు నరసింహారెడ్డి, వేణుగోపాల్ రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల జిల్లా అధికారులు విశ్వ మోహన్ రెడ్డి, అన్నాదొరై, కుష్బు కొఠారి, మహమ్మద్ రఫీ, వ్యవసాయ శాఖ జెడి చంద్రా నాయక్ తదితరులు పాల్గొన్నారు.










