Mar 18,2023 22:21

గుంతకల్లులో టిడిపి సంబరాలు

ప్రజాశక్తి-గుంతకల్లు       ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి మద్దతుదారులు గెలుపుపై సకల శాఖల మంత్రి సజ్జలు చేసిన వ్యాఖ్యలు సిగ్గు చేటని, విద్యా వంతులు, మేధావులు సిఎం జగన్‌ రెడ్డి అహంకారాన్ని దించేందుకు సరైన నిర్ణయం తీసుకున్నారని ఇది ప్రజా విజయమని నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి, మాజీ ఎమ్మెల్యే ఆర్‌.జితేంద్ర గౌడ్‌ అన్నారు. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి మద్దతుదారుడు భూమిరెడ్డి రాంభూపాల్‌రెడ్డి గెలుపును మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్‌ ఆధ్వర్యంలో టిడిపి నాయకులు శనివారం విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. జితేంద్రగౌడ్‌ క్యాంపు కార్యాలయంలోనూ, పొట్టి శ్రీరాములు కూడలిలోనూ, ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద, టిడిపి కార్యాలయంలో కేకులు కోసి తినిపించుకుని, బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసిపి నిరంకుశ పాలనపై విసుగుచెందిన పట్టభద్రులు చంద్రబాబు పాలనను కోరుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు ప్రాంతాల్లో టిడిపి మద్దతుదారులకు విజయాన్ని అందించారని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు వైసిపి నాయకులు ఎన్ని కుట్రలు చేసినా చివరకు విద్యావంతులు సిఎం జగన్‌రెడ్డికి సరైన గుణపాఠం చెప్పారని అన్నారు. ఈ గెలుపు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి గెలుపుకు నాంది అన్నారు. ఈ కార్యక్రమంలో బిసి సెల్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి పవన్‌కుమార్‌ గౌడు, నాయకులు కేసప్ప, మస్తానప్ప, ప్రతాప్‌ నాయుడు, జింకల జగన్నాథ్‌, హనుమంతు తదితరులు పాల్గొన్నారు.
పెద్దవడుగూరు : టిడిపి పట్టభద్రుల ఎమ్మెల్సీగా భూమిరెడ్డి రామగోపాల్‌ రెడ్డి గెలుపొందడంతో పెద్దవడుగూరులో ఆపార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. పార్టీ కార్యాలయంలో కేక్‌ కట్‌చేసి సంబరాలు చేసుకున్నారు. బాణసంచా కాల్చారు.
పుట్లూరు : పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల టిడిపి ఎమ్మెల్సీ అభ్యర్థి రాంగోపాల్‌రెడ్డి విజయం సాధించడంతో టిడిపి నాయకులు కేక్‌కట్‌ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి గరికపాటి సుదర్శన్‌ నాయుడు, నాయకులు రవిచంద్ర నాయుడు, రామాంజినేయులు, ఆదినారాయణరెడ్డి, శ్రీనివాసులురెడ్డి, లక్షుమయ్య, తదితరులు పాల్గొన్నారు.
నార్పల : పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌ రెడ్డి విజయం సాధించడంతో టిడిపి నాయకులు సంబరాలు చేసుకున్నారు. నార్పల మండల కేంద్రంలోని గాంధీ సర్కిల్‌లో అలం సోదరుల అధ్వర్యంలో బాణాసంచా పేల్చి విజయోత్సవ సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పిట్టు రంగారెడ్డి, తెలుగు యువత చంద్రబాబు, ప్రకాష్‌, నరసాపురం నాగేష్‌, చంద్రబాబు, తుంపెర రాధాకృష్ణ, నాగేష్‌, రామానాయుడు, జాఫర్‌ వలి, మురళి, హరీష్‌, మహేష్‌, గణేష్‌, జగదీష్‌, మంగల రామాంజి పాల్గొన్నారు.