Oct 25,2023 23:06

వంశధార డిఇతో ఫోన్‌లో మాట్లాడుతున్న అచ్చెన్నాయుడు

* టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు
ప్రజాశక్తి - కోటబొమ్మాళి: 
వర్షాభావ పరిస్థితులు, వంశధార కాలువల ద్వారా పూర్తిస్థాయిలో సాగునీరు అందకపోవడంతో వరి సాగుకు నష్టం వాటిల్లుతోందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. కోటబొమ్మాళి టిడిపి కార్యాలయంలో అచ్చెన్నాయుడును నియోజకవర్గంలోని రైతులు బుధవారం కలిసి వంశధార కాలువలు, ఎత్తిపోతల పథకాల ద్వారా సాగునీరందించడం లేదని తెలిపారు. దీంతో వరి పంట వెన్ను దశలోనే ఎండిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆయన వెంటనే వంశధార డిఇ, విద్యుత్‌ శాఖ డిఇకు ఫోన్‌ చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ వంశధార కాలువ ద్వారా సాగునీరు అందించడం ఆపకూడదన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సాగునీరు ఆగితే రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని చెప్పారు. వరి నాటిన తర్వాత వర్షాలు పడకపోవడంతో పంటలు ఎండిపోయి పూర్తిగా పాడైపోయాయని, తమకు పంట నష్టం అందించేలా చూడాలని రైతులు అచ్చెన్నాయుడును కోరారు. వ్యవసాయ అధికారులకు పంట పొలాలు చూపించి పంట నష్ట పరిహారం అడగాలని, ఈ ప్రభుత్వం అందించకపోతే టిడిపి ప్రభుత్వం వచ్చాక అందిస్తామని హామీనిచ్చారు.