Feb 28,2023 21:31

ఆక్వా చెరువులకు నీటిని మళ్లిస్తే ఇంజిన్లు సీజ్‌ - అధికారులకు కలెక్టర్‌ ప్రశాంతి ఆదేశాలు
ప్రజాశక్తి - కాళ్ల
ఆక్వా చెరువులకు నీటిని మళ్లిస్తే ఇంజిన్లు సీజ్‌ చేయాలి, శివారు వరి భూములకు సాగునీరు అందించేలా పర్యవేక్షణ చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి ఇరిగేషన్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ ప్రశాంతి మంగళవారం మండల కేంద్రమైన కాళ్లలో సాగునీటి పరిస్థితిపై సుడిగాలి పర్యటించారు. పంట పొలాలకు సాగునీరు అందించాలని వరి దుబ్బులతో తహశీల్దార్‌ కార్యాలయం ముందు కాళ్ల రైతులు సోమవారం ధర్నా చేసిన నేపథ్యంలో కలెక్టర్‌ ఇరిగేషన్‌ అధికారులతో కలిసి మంగళవారం వరి పొలాల పరిస్థితిని పరిశీలించారు. గత 15 రోజుల నుంచి పంట కాలవలో చుక్కనీరు కూడా రావడం లేదని, నీరు రాక తమ పొలాలన్నీ నెర్రలు తీసి ఎండిపోయాయని పలువురు రైతులు కలెక్టర్‌ వద్ద వాపోయారు. ఇరిగేషన్‌ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని కన్నీటిపర్యంతమయ్యారు. కెలంక పంటకాలువకు ఆనుకుని ఉన్న ఆక్వా రైతులు విద్యుత్‌ మోటార్ల ద్వారా నీటి చౌర్యానికి పాల్పడుతున్నా ఇరిగేషన్‌ అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు కలెక్టర్‌కు విన్నవించారు. కాళ్లలో నీటిఎద్దడితో చేలు ఎండిపోతున్నాయని ఇరిగేషన్‌ ఎఇకి చెప్పినా పట్టించుకోలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ప్రశాంతి అధికారులతో మాట్లాడుతూ శివారు పొలాలకు నీటిఎద్దడి రాకుండా వంతుల విధానం ద్వారా సాగునీరు సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆక్వా చెరువులకు నీటిని మళ్లిస్తున్న విద్యుత్‌ మోటార్లను అవసరమైతే సీజ్‌ చేయాలని తహశీల్దార్‌ను ఆదేశించారు. ఇరిగేషన్‌ ఎఇ ఫణిశంకర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న రెండు రోజుల్లో పంట పొలాలకు పూర్తిస్థాయిలో నీరందించేలా చూడాలని ఇరిగేషన్‌ అధికారులను ఆమె ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జలవనరుల శాఖాధికారి పి.నాగార్జున, ఇరిగేషన్‌ ఇఇ దక్షిణామూర్తి, జిల్లా వ్యవసాయ శాఖాధికారి జెడ్‌.వెంకటేశ్వరరావు, డిఇలు పిఎన్‌వివిఎస్‌.మూర్తి, ఎ.వెంకటేశ్వరరావు, తహశీల్దార్‌ టిఎ.కృష్ణారావు, ఆర్‌ఐ రాఘవమూర్తిరాజు, ఎఒ సిహెచ్‌.జయవాసుకి, రైతులు పాల్గొన్నారు.
ఉండి: శివారు ప్రాంతంలోని పంటలకు నీటిఎద్దడి రాకుండా వంతులవారీ విధానం ద్వారా సాగునీరు సక్రమంగా అందించాలని జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి అధికారులను ఆదేశించారు. మంగళవారం మండలంలోని చెరుకువాడ గ్రామ శివారు ప్రాంతాలకు నీరందించే కాలువలను, బ్రాంచ్‌ కాలవలను కలెక్టర్‌ పరిశీలించారు. రైతులతో మాట్లాడి నీరందించడానికి తీసుకోవాల్సిన చర్యలు గురించి చర్చించారు. ఆక్వా చెరువులకు నీటి మళ్లింపు ఆపితే ఇబ్బంది ఉండదని రైతులు ముక్తకంఠంతో తేల్చి చెప్పారు. దీనిపై కలెక్టర్‌ మాట్లాడుతూ ఆక్వా చెరువులకు నీటి మళ్లింపు లేకుండా కట్టుదిట్టంగా పర్యవేక్షించాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా అధికారులతోపాటు తహశీల్దార్‌ ఎం.రవీంద్రకుమార్‌, ఆర్‌ఐ వి.ఆంజనేయులు, చెరుకువాడ సర్పంచి కొండవీటి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.