ప్రజాశక్తి వార్తకు స్పందన
ప్రజాశక్తి - ఉండి
శిథిలావస్థకు చేరిన ఉండి చిన్నవంతెనను పంచాయతీరాజ్ శాఖ ఆకివీడు సబ్ డివిజన్ డిఇ కెఎస్.శ్రీనివాసరావు సోమవారం పరిశీలించారు. శిథిలావస్థలో వంతెన శీర్షికన ఈ నెల 15వ తేదీన ప్రజాశక్తిలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంతెన పునాది బలంగానే ఉందని, కాని స్లాబ్ మాత్రం పూర్తిగా పాడైపోయిందని చెప్పారు. ఉండి గ్రామపంచాయతీ వారు గతంలో ఈ వంతెన పైనుంచి పైపులైను వేయడంతో పైపులైను లీకేజీ సమయంలో నీరు నిలిచిపోయి ఒక వైపు స్టీల్ బీము పూర్తిగా పాడైపోయిందన్నారు. వంతెన స్లాబ్ మార్చి కొత్తగా వేయడానికి సుమారు రూ.15 లక్షల ఖర్చవుతుందని ఉండి గ్రామపంచాయతీ పాలకవర్గానికి చెప్పారు. అనంతరం ఉండి ఉప సర్పంచి గొట్టుముక్కల కల్యాాణ్‌వర్మ మాట్లాడుతూ జిల్లా పరిషత్ నిధుల నుంచి ఈ వంతెన స్లాబ్ నిర్మాణం గురించి నియోజకవర్గ ఇన్‌ఛార్జి పివిఎల్.నరసింహరాజు దృష్టికి తీసుకెళ్తామని, ఆయన సహకారంతో జిల్లా పరిషత్ నిధులు కేటాయించేలా జెడ్‌పిటిసితో మాట్లాడతామని చెప్పారు.










