సిరులు కురిపిస్తున్న సిరికల్చర్
ప్రజాశక్తి- శాంతిపురం
మండలంలో సిరికల్చర్ ద్వారా పట్టు గూళ్ల ఉత్పత్తి చేయడం రైతుల ఇంట సిరులు కురిపిస్తోంది. తక్కువ వ్యవధి, తక్కువ కూలీ ఖర్చు, పెట్టుబడితో కషించి రైతులు ఎక్కువ ఆదాయం పొందుతున్నారు. పట్టు పరిశ్రమశాఖ మల్బరీ మొక్కలు నాటడం మొదలుకొని షెడ్ల నిర్మాణం, ఎరువులు, మందులు, పరికరాలు రాయితీపై రైతులకు అందజేస్తుంది. ప్రభుత్వం ఇచ్చే చేయూతను మండలంలోని రైతులు సద్వినియోగం చేసుకుని ఆధునిక పద్ధతుల్లో పట్టుపురుగుల పెంపకం చేపట్టడంలో పట్టుసాధించారు.
మండలంలోని రైతులు అధికంగా కోలార్ చిన్న, బైవోల్టీన్ పట్టుగూళ్ల ఉత్పత్తిని చేస్తున్నారు. కేవలం 30రోజుల్లో 100 పట్టుగుడ్లతో పురుగుల పెంపకం చేపట్టి 70నుంచి 90 కిలోల పట్టుగుడ్లను ఉత్పత్తి చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో బైవోలీటిన్ పట్టుగూళ్ళు రూపాయలు 700 పైగా పలుకుతోంది. అలాగే కోలార్ చిన్న 600 నుండి 630 రూపాయల వరకు ధర పలుకుతోంది. అంతేకాక రైతులు ఉత్పత్తిచేసే పట్టుగూళ్లకు కిలోకు రూ.50ల వంతున ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుంది. మండలంలోని నక్కలపల్లి, గుజ్జర్లపల్లి, శివరామపురం, కొలమడుగు, తుమ్మిసి.కొత్తూరు, ఎద్దులపల్లి, 121పెద్దూరు తదితర గ్రామాల్లో సుమారు 5000 మంది రైతులు ఉన్నారు. పట్టు పరిశ్రమ శాఖ అందించిన సబ్సిడీతో సుమారు మూడు వేల మంది రైతులు షెడ్లు నిర్మించుకున్నారు. ఒకప్పుడు కూలికి పోతే గాని ఇల్లు గడవని పరిస్థితుల్లో ఉన్న రైతులు పట్టుపురుగుల పెంపకం ద్వారా ఆనందమయమైన జీవితం సాగిస్తున్నారు.
పట్టుపురుగుల పెంపకానికి కావల్సినవి...
పట్టుపురుగుల పెంపకానికి ముఖ్యంగా కావలసింది మల్బరీ ఆకులు, అనువైన ప్రాంతంలో పురుగుల పెంపకంకి షెడ్లు, గురువుల చేత గుళ్ళు కట్టించడానికి మౌంటింగ్ హాల్, మార్కెట్ సౌకర్యం. మొదటగా సిరికల్చర్ డ్రైనేజ్ నుంచి నాణ్యమైన గుడ్లు తీసుకుని వచ్చి చాకీసెంటర్‌లో చాకీ (గుడ్లు పొదిగించడం) చేయాలి. గుడ్ల నుంచి వచ్చిన పురుగులకు వి1 రకం మల్బరీ ఆకులు వేయాలి. ఆకులు తిని పెరుగుతున్న పురుగులు ఏడు రోజుల్లో రెండు జ్వరాలు బంద్ అవుతాయి. తరువాత పురుగులను జాకీ సెంటరు నుంచి తీసుకుని వచ్చి షెడ్లలో ఏర్పాటు చేసిన బెడ్‌లపై ప్రతిరోజు ఆకు వేసి మరో 25 రోజులు మేపాలి. అలా పెద్దవైన పురుగులు గూడు కట్టడానికి సిద్ధమవుతాయి. దీన్ని గుర్తించి మౌంటింగ్ హాల్లోని చంద్రిక లో వేస్తే గూళ్ళు కడతాయి. గోళ్లను విడిపించి మార్కెట్ తరలించి సొమ్ము చేసుకోవాలి.










