సిరుల 'పట్టు' మల్బరీ సాగుపై రైతుల ఆసక్తి ఈ ఏడాది 38వేల ఎకరాల్లో... ఆన్‌లైన్ మార్కెట్‌తో అధిక లాభాలు
సిరుల 'పట్టు'
మల్బరీ సాగుపై రైతుల ఆసక్తి
ఈ ఏడాది 38వేల ఎకరాల్లో...
ఆన్‌లైన్ మార్కెట్‌తో అధిక లాభాలు
ప్రజాశక్తి - చిత్తూరు అర్బన్
వ్యవసాయ రంగం ఆధునికతను సంతరించుకుని కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ ఏడాది సెరికల్చర్ (పట్టు సాగు)పై రైతులు ఆసక్తి చూపి దాదాపు 38వేల ఎకరాల్లో సాగు చేసేందుకు సుముఖత చూపారు. గతంలో పట్టు సాగు చాలావరకూ ఇబ్బందులు కలిగించేది. వివిధ రకాల వ్యాధులు అరికట్టలేక, నీటి వసతి కరువై ఇబ్బందులు పడుతూ వచ్చారు. ప్రస్తుతం పట్టు పురుగుల పెంపకం రైతులకు సిరులు కురిపిస్తోంది. ఏటేటా విస్తీర్ణం పెంచుతూ లాభాలు పెంపొందించుకుని రైతులు ముందుకెళుతున్నారు. ముఖ్యంగా కీటకాలు, ఏనుగులు ఈ పంట వైపు మళ్లే అవకాశం లేకపోవడంతో పడమటి మండలాల రైతులు సెరికల్చర్ సాగు వైపు మక్కువ చూపుతున్నారు.
జిల్లావ్యాప్తంగా 21,600 మంది రైతులు దాదాపు 38వేల ఎకరాల్లో 29 మండలాల్లో సెరికల్చర్‌ను సాగు చేస్తున్నారు. గత ఆరు నెలల్లో 13,623 మెట్రిక్ టన్నుల పట్టు గూళ్లు ఉత్పత్తి చేసి దాదాపు 690 కోట్ల ఆదాయం పొందారు. ప్రధానంగా బైఓల్టిన్ రకం 2,764 మెట్రిక్ టన్నులు పండించారు. పట్టుదారం తీసి వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేయడం ద్వారా 1500 మంది రీలర్లు ఉపాధి పొందుతున్నారు. ఈ పంట సాగులో దాదాపు ముగ్గురు లేదా నలుగురికి ఉపాధి సైతం లభిస్తుండటం గమనార్హం.
పలమనేరు సమీపంలోని చాకి పురుగుల పెంపక కేంద్రం. అలాగే కర్నాటక రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో చాకీకి సంబంధించిన గుడ్లు లభిస్తున్నాయి. పడమటి మండలాల్లోని శీతల వాతావరణం ఈ పంట సాగుకు అనుకూలం. ఒక్కసారి మల్బరీ సాగు చేస్తే 20 ఏళ్లయినా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పంటను కొనసాగించవచ్చు. ప్రభుత్వ సహకారంతో నిర్మించుకున్న షెడ్లు దాదాపు 30 ఏళ్ల కాలపరిమితి ఉంటుంది. పట్టు పరిశ్రమకు ప్రధానంగా మల్బరీ ఆకు ముఖ్యమైనది. విత్తన కొనుగోలుకు ఇబ్బంది ఉండదు. ఎవరైతే మల్బరీ సాగు చేస్తున్నారో వారి వద్ద నుంచి కొమ్మలు తెచ్చుకుని ఒక్కో కొమ్మకు రెండు అడుగుల దూరం ఉంచి నాటతారు. మొక్కలు చెట్లుగా రూపాంతరం చెందడానికి నెలరోజులు సరిపోతుంది. మొక్కలలో ప్రధానంగా చిత్తూరు జిల్లాలో వి1, బరంపురం ప్రధానమైనవి. ఈ రెండు రకాలు రెండవ పంట రావడానికి నెల నుంచి నెలన్నర వ్యవధి మాత్రమే. ఒక్కో ఏడాదిలో ఆరు నుంచి తొమ్మిది పంటలను తీసుకునే అవకాశం మల్బరీ లో ఉంది. మొదట గుడ్లు తీసుకురావడం వాటిని పొదిగించడం గ్రామాలలోనే చేసేవారు.
విభిన్న వాతావరణ పరిస్థితులను దష్టిలో పెట్టుకొని చాకిపురుగుల కేంద్రం వారు వారి వద్దనే పురుగులుగా తయారు అయ్యేంతవరకు ఉంచుకొని రైతులకు ఇవ్వడం చేస్తున్నారు. ఈ విధంగా ఒక గాజు రింగు సైజులో ఉండే మల్బరీ గుడ్లను ఒకటిగా భావిస్తారు. అలా 100 గుడ్లు తీసుకువస్తే ప్రస్తుతం 80 కేజీల వరకు పట్టు గూళ్లు వస్తాయి. ఇందుకోసం ఏర్పాటు చేసుకున్న షెడ్లలో ఆధునిక సాంకేతిక పద్ధతుల ద్వారా మల్బరీ పురుగుల పెంపకం సాగుతుంది. చివరి దశలోకి తిరిగి గూళ్ళు అల్లుకొని మనకు లాభాలు పెంచుతాయి. ఈ మొత్తం ప్రక్రియ 30 రోజుల్లోపు పూర్తి అవుతుంది. రెండు ఎకరాలలో మల్బరీ సాగు చేసేవారు సంవత్సరానికి 6 పంటలు తీస్తారు. 100 గుడ్లతో 80 కేజీల వరకు పట్టుగూళ్ళు ఉత్పత్తి అవుతుండగా ప్రస్తుతం ధరలు భారీగా ఉండటంతో రైతులకు మంచి ఆదాయం లభిస్తోంది. పలమనేరు, కుప్పం నియోజకవర్గాలలో పలు ప్రాంతాలలో గ్రామాలకు గ్రామాలే పట్టు పరిశ్రమపై ఎక్కువ మక్కువ చూపుతున్నారు. అందుకు ప్రధాన కారణం ఈ ప్రాంతాలు ఎక్కువగా అటవీ ప్రాంతాల వైపు ఉండడం, ఏనుగులు ఈ పంటను ఎక్కువ ఆశించకపోవడం ప్రధానంగా భావిస్తున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వ ప్రోత్సాహకం బాగా ఉండటంతో మరింత విస్తీర్ణంలో పంట సాగు చేసేందుకు రైతులు ముందుకు వస్తున్నారు. జిల్లాలోని 31 మండలాలలో 27 మండలాల్లో పట్టు సాగు చేస్తున్నారు.
ఆన్‌లైన్ అమ్మకాలు
గతంలో పట్టుగూళ్ల మార్కెట్‌కు వెళ్లి మార్కెటింగ్ చేసుకునే పరిస్థితి ఉండేది. కొన్ని ప్రాంతాలలో అలా కాకుండా పట్టు దారం తీసే వ్యాపారస్తులు నేరుగా గ్రామాలలోకి వెళ్లి ముందే ధరలు నిర్ణయిస్తున్నారు. అయితే ఏరోజుకారోజు ఉన్న ధరలను ఆన్లైన్ ద్వారా తెలుసుకొని అమ్ముకుంటున్నారు. దీనివల్ల రైతులకు సిరికల్చర్ పంట సిరులు కురిపిస్తోంది.
డ్రిప్‌తో సాగుఖర్చు తక్కువ
సాగుకు అయ్యే ఖర్చు తక్కువ. ఒకసారి డ్రిప్ వేస్తే పది సంవత్సరాల పాటు ఉంటుంది కనుక నీటి తడులు కూడా దీనికి చాలా వరకు తక్కువగానే ఇవ్వాల్సి ఉంటుంది. వాతావరణం తోపాటు ప్రస్తుతం వర్షాలు బాగా కురుస్తుండడంతో రైతన్నలు ఈ పంటను ఎక్కువగా సాగు చేస్తున్నారు.










