ప్రజాశక్తి - వీరవాసరం
సిసిఎం సీనియర్ నేత నేతల ఆనందరావు మృతి ఉద్యమానికి తీరని లోటు అని పలువురు సిపిఎం, ప్రజా సంఘాల నాయకులు తెలిపారు. నేతల ఆనందరావు మృతదేహాన్ని పలువురు సిసిఎం, ప్రజా సంఘాల నేతలు శనివారం సందర్శించి ఆయన భౌతికకాయంపై పార్టీ జెండా కప్పి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు ఆనందరావుతో ఉన్న సాన్నిహిత్యాన్ని, ప్రజా ఉద్యమంలో ఆయన పాత్రను నెమరవేసుకున్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం మాట్లాడుతూ ఆనందరావు ఉద్యమ జీవితం నేటి తరానికి ఆదర్శమన్నారు. ఉద్యమాల గడ్డ మత్స్పపురిపాలెం నుండి ప్రజా సమస్యల పట్ల పరితపించే వ్యక్తి మరణం తీర్చలేనిదన్నారు. ఆయన భార్య శకుంతల వెన్నెంటే ఉంటూ సారా వ్యతిరేక ఉద్యమంలో ఆమె నిర్వహించిన పాత్ర ఆదర్శనీయమన్నారు. జిల్లా నాయకులు జుత్తిగ నరసింహమూర్తి మాట్లాడుతూ యాభై సంవత్సరాలు సిపిఎం నాయకుడుగా ఉంటూ ప్రజా ఉద్యమంలో మహోన్నత నాయకులతో కలిసి పని చేసిన నేత ఆనందరావు అన్నారు. ప్రజా సమస్యల పట్ల ఉద్యమించడంలో ఆయన ముందుండేవారన్నారు. శృంగవృక్షంలో భూస్వాములకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో కూలీల తరపున చేసిన పోరాటం ఆయన ధైర్యానికి ప్రతీక అన్నారు. వ్యవసాయ కార్మికులు హక్కుల కోసం జిల్లా స్థాయిలో చేసిన పోరాటంలో ఆయన ముఖ్యపాత్ర వహించారన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ వ్యవసాయ కార్మిక సంఘంలో ఆయన నాటిన విత్తనం నేడు మహావృక్షంగా మారిందన్నారు. వారి పోరాటం వల్ల నేడు ఉపాధి హామీ చట్టం అమలవుతోందన్నారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.రాజా రామ్మోహన్‌రారు మాట్లాడుతూ విద్యార్థి దశలో ఉద్యమాల పట్ల ఆనందరావు ప్రోత్సాహం మరువలేనిదన్నారు. కష్టకాలంలో మత్స్యపురిపాలెం అగ్రనాయకులకు షెల్టర్‌జోన్‌గా ఉండేదని, ఆ సమయంలో ఆయన భార్య, కుటుంబ సభ్యుల ఆదరణ మరువలేనిదని తెలిపారు. సిపిఎం వీరవాసరం, పాలకోడేరు మండలాల కన్వీనర్‌లు పోతుల మృత్యంజయ, అశ్రియ్య, సిపిఎం నాయకులు బాలం విజయకుమార్, లింగం సత్యనారాయణ, యండమూరి సుబ్బారావు, బళ్ల చిన వీరభద్రరావు, గొట్టుముక్కల ప్రభాకరరావు, పీతల సుబ్రహ్మణ్యం, వీరవాసరం మాజీ సర్పంచి పీతల విక్టోరియా మహారాణి, వైస్ ఎంపిపి చిలకపాటి ప్రకాశం, శ్రేయాభిలాషుల పాల్గొన్నారు.










