అనంతపురం ప్రతినిధి : ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇప్పుడు శింగనమల నియోజకవర్గం రాజకీయ వేడిని రాజేస్తోంది. అటు ప్రతిపక్ష టిడిపిలో అంతర్గత కుమ్ములాటలు కొనసాగుతుండగా, ఇటు అధికార వైసిపిలోనూ గ్రపు తగాదాలు తారా స్థాయిలోనే నడుస్తున్నాయి. రెండు పార్టీల్లోనూ అంతర్గతపోరుకు కేంద్రంగా ఈ నియోజకవర్గం మారింది. మొన్నటి వరకు ప్రతిపక్ష టిడిపిలో ఎక్కువగా అసమ్మతి కనిపించేది. ప్రస్తుతం ఇది వైసిపికి పాకింది. బుధవారం నాడు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పర్యటన తరువాత అధికార పార్టీలో ఒక్కొక్కటిగా అసమ్మతి రాగాలు బయటకు వస్తున్నాయి.
శింగనమల ఎస్సీ రిజర్వు నియోజక వర్గంగా ఉన్నప్పటికీ ఒక బలమైన సామాజికవర్గ అధిపత్యం ఈ నియోజకవర్గంలో స్పష్టంగా కనిపిస్తుంది. ముందు నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ అదే తీరున రాజకీయాలుంటాయి. ప్రజాప్రతినిధిగా ఎస్పీ సామాజిక తరగతికి చెందిన వారున్నప్పటికీ ఆయా మండలాలు, గ్రామాల్లో పెత్తందారులదే పైచేయిగా ఉంటుంది. వారి కనుసన్నల్లోనే అక్కడి రాజకీయాలు నడుస్తూ ఉంటాయి. కాదంటే సదరు ప్రజాప్రతినిధికి సైతం తిప్పలు తప్పవు. ఈ క్రమంలో ఇప్పుడు ఎన్నికలు సమీస్తుండటంతో ఆయా పార్టీల్లో గ్రూపు తగాదాలు తీవ్ర స్థాయికే చేరుతుండటం గమనార్హం.
వైసిపిలో భగ్గుమంటున్న విభేదాలు
వైసిపిలో గ్రూపు తగాదాలు భగ్గుమంటున్నాయి. ఈ నియోజకవర్గంలో యల్లనూరు, పుట్లూరు మండలాలు ఫ్యాక్షన్ ప్రాంతాలుగా ప్రసిద్ధి చెందాయి. ఇక్కడి గ్రూపులకు ప్రాతినిథ్యం వహించే నాయకులు ఏ పార్టీలో ఉన్నా ఈ గ్రూపు తగాదాలు మాత్రం కొనసాగుతూనే ఉంటాయి. గతంలో కాంగ్రెసు పార్టీ ఉన్న సమయంలోనైనా ఇప్పుడు వైసిపిలోకి ఆ నాయకులొచ్చినా ఇదే తీరు కొనసాగుతోంది. యల్లనూరు మండలంలో శుక్రవారం నాడు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, మరోవైపు వైసిపి నాయకులైన భోగాతి నారాయణరెడ్డి గ్రూపుల మధ్య వివాదం చెలరేగింది. తమ మద్దతుదారులను అన్యాయం చేస్తున్నారంటూ తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి పోలీసు స్టేషన్ వద్ద నిరసనకు దిగడం గమనార్హం. భోగాతి నారాయణరెడ్డికి ముఖ్యమంత్రి సలహదారుగానున్న ఆలూరు సాంబశివారెడ్డి ముందు నుంచి మద్దతునిస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. దీంతో అటు సాంబశివారెడ్డి, ఇటు కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య కూడా సఖ్యతలేదు. ఈ లేమి కారణంగానే అనంతపురం జిల్లాలోని నార్పలలో జరిగిన ముఖ్యమంత్రి పర్యటనకు సైతం పెద్దారెడ్డి హాజరవన్నట్టు ఆ పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. సత్యసాయి జిల్లాలో పుట్టపర్తి విమానాశ్రయంలో పెద్దారెడ్డి ముఖ్యమంత్రిని కలిసారు. కాని ఇక్కడ మాత్రం కార్యక్రమానికి హాజరవలేదు. ఈ విభేదాల కారణంగానే హాజరవనట్టు ప్రచారం సాగుతోంది. ముఖ్యమంత్రి పర్యటన ముగియకముందే చామలూరు రాజగోపాల్ ఎస్సీ సెల్ నాయకులు కూడా సాంబశివారెడ్డికి వ్యతిరేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో ఎస్సీ సామాజికవర్గం నుంచి ఎదుగుతున్న తనను తొక్కేస్తున్నారని ఆరోపించారు. ఈ రకంగా అధికార పార్టీలో గ్రూపు రాజకీయాలు రోజురోజుకూ పెరుగుతూ పోతున్నాయి.
టిడిపిలోనూ ఇదే తీరు...
శింగనమల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలోనూ ఇదే రకమైన గ్రూపు తగాదాలు కొనసాగుతున్నాయి. ఈ గ్రూపు తగాదాలు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పర్యటన సమయంలోనూ స్పష్టంగా కనిపించాయి. టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా ఉన్న బండారు శ్రావణి సమన్వయం చేయలేకున్నారని టుమెన్ కమిటీ పేరుతో ముంటిమడుగు కేశవరెడ్డి, ఆలం నరసానాయుడును ఆ పార్టీ అధిష్టానం నియమించింది. ఈ కమిటీకి, శ్రావణికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. పై ఇద్దరు ఓసి సామాజిక తరగతి కావడంతో ఇద్దరిలో ఎవరూ ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు వీల్లేని పరిస్థితి ఉంది. దీంతో ఎస్సీ రిజర్వు నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో ఎవరైతే మెరుగన్న దిశగా ఆ పార్టీ ఆలోచిస్తోంది. ముఖ్య నేతలు కూడా బలమైన వారిని ఈ నియోజకవర్గం బరిలో దింపేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. మాజీ మంత్రి డాక్టర్ శైలజనాథ్‌ను మాజీ ఎంపీ జెసి.దివాకర్‌రెడ్డి బుధవారం నాడు కలిసి మాట్లాడుకోవడం పెద్ద చర్చనీయాంశమే అయింది. ఇలా రెండు పార్టీల్లోనూ అంతర్గత పోరు తీవ్ర స్థాయిలో నడుస్తుండటం ఆ నియోజకవర్గంలో రాజకీయ వేడిని పెంచుతున్నాయి.










