Oct 31,2023 23:53

మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌

* డిఐసి సమావేశంలో కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌
ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌: 
సింగిల్‌ డెస్క్‌ కింద జిల్లాలో 154 అనుమతులు మంజూరు చేసినట్లు కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌ వెల్లడించారు. కలెక్టరేట్‌లో జిల్లా ఇండిస్టీస్‌ అండ్‌ ఎక్స్‌ పర్టు ప్రమోషన్‌ కమిటీ సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో సింగిల్‌ డెస్క్‌ విధానం ద్వారా 154 అనుమతులు మంజూరు చేసినట్టు వివరిం చారు. ఈ విధానం ద్వారా నిర్ణీత సమయంలో సంబంధిత శాఖలు అనుమతులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాకు ఎంఎస్‌ఎంఇ క్లస్టర్‌ డెవలెప్‌మెంట్‌ కింద రెండు క్లస్టర్లు మంజూరయ్యాయని అన్నారు. అందులో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ క్లస్టర్‌, హెల్త్‌ కేర్‌ క్లస్టర్‌ ఉన్నాయని తెలిపారు. ఈ క్లస్టర్ల ఏర్పాటు ప్రతిపాదనలు రాష్ట్ర ప్రాజెక్టు అప్రూవల్‌ కమిటీ నుంచి నేషనల్‌ ప్రాజెక్టు అప్రూవల్‌ కమిటీకి పంపించామని పేర్కొన్నారు. ప్రభుత్వం ఆమోదించిన పారిశ్రామిక ప్రోత్సాహక పాలసి 2023-27 కమిటీ ముందు విధి విధానాలు ఉంచామని అన్నారు. ఈ పాలసీ ద్వారా పెట్టుబడి రాయితీ, సేల్స్‌ ట్యాక్స్‌ రాయితీలు, వడ్డీ సబ్సిడీ, ఎపిఐఐసిలో నిర్థేశించిన ధరకు స్థలం, విద్యుత్‌ రాయితీ, ఇతర రాయితీలు వస్తాయన్నారు. పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు చిన్న పిల్లలు ఉన్నట్టయితే తల్లులకు సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. ఎపిఐఐసికి పాత్రునివలస దగ్గర భూ కేటాయించామని అన్నారు. ఈ స్థలం ఏ స్థితి ఉందని జోనల్‌ మేనేజర్‌ యతిరాజును అడిగి తెలుసుకున్నారు. పరిశ్రమలు ఏర్పాటు చేయాలంటే విద్యుత్‌, నీరు, రహదారి తప్పనిసరిగా ఉండాలన్నారు. భూమి కేటాయించిన ప్రాంతంలో ఇవి తప్పక అందుబాటులో ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పరిశ్రమల శాఖ ఎడీ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ పరిశ్రమలశాఖ ద్వారా జిల్లాలో 41 యూనిట్లకు రూ.1.76 కోట్లు ఇన్సెంటివ్స్‌ మంజూరు చేసినట్లు చెప్పారు. సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు విశ్వమోహన్‌రెడ్డి, సిటిఒ రాణిమోహన్‌, ఎల్డీయం సూర్యకిరణ్‌, సుడా డిటిసి శోభన్‌బాబు, ఎపిఇపిడిఎల్‌ ఇఇ ఎల్సియస్‌ పాత్రుడు, ఉద్యానవన శాఖ ఎడీ ప్రసాదరావు, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు ఎఒ పద్మావతి, పరిశ్రమలశాఖ సహాయ సంచాలకులు రమణారావు, రఘునాథ్‌రావు, ఫ్యాక్టరీస్‌ ఇన్‌స్పెక్టర్‌ రాంబాబు, రమాదేవి పాల్గొన్నారు.