May 21,2023 21:39

సాధన నవలను ఆవిష్కరిస్తున రచయిత శాంతి నారాయణ, రచయితలు

         ప్రజాశక్తి-అనంతపురం  రాయలసీమ అస్తిత్వ సాధన, ప్రస్థానం గురించి తెల్పేందుకే 'సాధన' నవల రాశానని ప్రముఖ కథా నవలా రచయిత డాక్టర్‌ శాంతి నారాయణ తెలిపారు. రాయలసీమ టూరిజం, కల్చరల్‌ సొసైటీ ప్రధాన కార్యదర్శి కొండూరు జనార్ధనరాజు ఆధ్వర్యంలో ఆదివారం కడప నగరం సి.పి.బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రంలో 'సాధన' నవల పరిచయ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 80 సంవత్సరాలుగా సీమకు అన్యాయం జరుగుతోందన్నారు. ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు, భాష, ఆహారం, జీవన విధానాన్ని కోస్తా వారు ఎద్దేవా చేస్తూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీటికితోడు సినిమాల్లో సీమవాసులను హింసావాదులుగా చూపడం అన్యాయమన్నారు. దివంగత ముఖ్యమంతి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, నందమూరి తారక రామారావుకు మాత్రమే ఈ ప్రాంతంపై నిబద్ధత ఉందన్నారు. వారి తర్వాత ఎవరికీ లేకుండా పోయిందన్నారు. ఈ వివక్షను నేటితరానికి తెల్పేందుకే 'సాధన' నవల రాశానని తెలిపారు. బిసి సంక్షేమ శాఖ జిల్లా అధికారి వల్లూరు మాట్లాడుతూ ప్రపంచీకరణ ప్రభావంతో అభివృద్ధిని నేటితరం ఆర్థికంగానే చూస్తోందన్నారు. తామేం కోల్పోతున్నామో వీరికి తెలియకపోవడం బాధాకర మన్నారు. ఇలా అవగాహన లోపంతోనే ముఖ్యమైన అంశాల్లో నేటి యువతలో వెనుకబాటుతనం కనిపిస్తోందన్నారు. సభాధ్యక్షులు మూల మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ ప్రజాశ్రేయస్సును కాంక్షించేదే కేవలం సాహిత్యమే అన్నారు. 'సాధన' నవల ద్వారా రచయిత సార్థకత సాధించారన్నారు. అంతకుముం దు ప్రధానవక్త కె.నాగేశ్వరాచారి నవలను సమీక్షించి పరిచయం చేశారు. నిద్రాణంగా ఉన్న సమాజాన్ని జాగృతం చేయడంలో సాధన నవల ద్వారా రచయిత శాంతి నారాయణ కృతకృత్యుడయ్యారన్నారు. మన ప్రాంత అస్తిత్వంపై జరుగుతున్న దాడికి ఈ నవల గట్టి సమాధానమిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో వేంపల్లె షరీఫ్‌, ఇంటాక్‌ కడప చాప్టర్‌ కన్వీనర్‌ లయన్‌ మానస, కె.చిన్నపరెడ్డి పాల్గొన్నారు.