సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించండి
పకడ్బందీగా యాంటీ లార్వల్ కార్యక్రమాలు: కమిషనర్ అరుణ
ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్: నగరంలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని, వ్యాధులపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని నగర కమిషనర్ డాక్టర్ జె.అరుణ ప్రజారోగ్య విభాగం అధికారులు, వార్డు కార్యదర్శులు, వాలంటీర్లను ఆదేశించారు. బుధవారం కమిషనర్ 17వ వార్డు పరిధిలో విస్తతంగా పర్యటించారు. ఇంటింటికీ వెళ్లి సీజనల్ వ్యాధులపై ఆరా తీశారు. ఇళ్ల వద్ద దోమల లార్వాలకు సంబంధించి నిల్వ నీటి పాత్రలు, తోట్టెలను పరిశీలించారు. నిల్వ నీటిలో దోమలు పెరుగుతాయని, తద్వారా జ్వరాలు వ్యాపిస్తాయని, నీటి తొట్టెలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకొని, తాజా నీటిని పట్టుకోవాలన్నారు. వార్డు పరిధిలో పారిశుద్ధ్య కార్యక్రమాలను తనిఖీ నిర్వహించి, కార్మికులతో మాట్లాడారు. అనంతరం అధికారులలు, వార్డుకార్యదర్శులు, వాలంటీర్లతో సమీక్ష నిర్వహించారు. క్లీన్ ఆంధ్రప్రదేశ్, హౌసింగ్, యాంటీ లార్వల్ ప్రోగ్రాం, ఫీవర్ సర్వే, పన్నుల వసూలు అంశాలపై సమీక్షించారు. అనంతరం కోఆప్షన్ సభ్యులు చందు, స్థానికులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మురుగునీరు వెళ్లేందుకు అవుట్లెట్ లేదని విన్నవించారు. సత్వర చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అనంతరం కమిషనర్ పుత్తూరు రోడ్డు లో జరుగుతున్న మొక్కలు నాటే కార్యక్రమం పరిశీలించారు. కార్యక్రమంలో సహాయ కమిషనర్ గోవర్థన్, అధికారులు పాల్గొన్నారు.










