ప్రజాశక్తి-ఆత్మకూరు వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులపై ప్రజలు, వైద్యసిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి యుగంధర్ సూచించారు. శనివారం మండల పరధిలోని తలుపూరు ఆరోగ్య ఉప కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందులో భాగంగా వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం, జ్వరాల సర్వే, అంగన్‌వాడీ కేంద్రంలో ఇచ్చే పౌష్టికాహారం, ఆరోగ్య స్థితి, పర్యవేక్షణపై ఆరాతీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులైన మలేరియా, డెంగీ వ్యాపించకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఫ్రైడే డ్రైడే నిర్వహించి దోమలు పెరిగే ప్రదేశాలను గుర్తించి అబేట్ ద్రావణం పిచికారీ, ఫాగింగ్ చేయాలని సూచించారు. అలాగే ప్రతినెలా గ్రామీణ పారిశుధ్య కమిటీ సమావేశాలు నిర్వహించి దోమల నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ఆరోగ్య కేంద్రంలో అన్నిరకాల ఆరోగ్య సేవలు, ఫ్యామిలీ డాక్టర్ విధానంలో అనుమానిత రోగులు ఉంటే వారికి డాక్టర్‌తో పరీక్షలు చేయించి చికిత్స అందించాలన్నారు. కంటి వెలుగు కింద కంటి సమస్యలు ఉన్నవారికి అవసరమైన శస్త్ర చికిత్సలు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు దయాకర్, సిహెచ్‌ఒ శమీమ్ తారా, పిహెచ్‌ఎన్ తొలిసమ్మ, సూపర్‌వైజరు వెంకటరత్నమ్మ, ఎఎన్‌ఎం, ఆశా, తదితరులు పాల్గొన్నారు.
ఆసుపత్రి సిబ్బందితో మాట్లాడుతున్న జిల్లా వైద్యాధికారి యుగంధర్










