Aug 24,2022 22:24

సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
వాటర్‌ ట్యాంకులను శుభ్రం చేయించాలి : జిల్లా కలెక్టర్‌
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌ :

జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం కింద జిల్లాలో అన్ని ఎస్‌డబ్ల్యూ పిసిలను అందుబాటులోకి తీసుకురావాలని, గ్రామాలను శుభ్రంగా ఉంచాలని, క్రమపద్ధతి ప్రకారం నీటి ట్యాంకులను శుభ్రం చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎం.హరి నారాయణన్‌ ఈవో పీఆర్డీలను గ్రామసెక్రటరీలను ఆదేశించారు. బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడుతూ జిల్లాలో 697 గ్రామపంచాయతీలకు గాను 580 ఎస్‌డబ్ల్యూపిసి షెడ్యూల్‌ ఉన్నాయని ఇందులో 382 మాత్రం పనిచేస్తున్నాయని మిగతా వాటిని వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. క్లాప్‌మిత్రుల ద్వారా చెత్తసేకరణ సక్రమంగా జరగాలని సేకరించిన చెత్తను ఎస్‌డబ్ల్యూపిసి షెడ్లకు పంపి సంపదను సష్టించాలని అన్నారు. మేజర్‌ పంచాయతీలలో ఇప్పటికే స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాలు జరుగుతున్నాయని మరో 149పంచాయతీలకు విస్తరించాలని మిగతా పంచాయతీలలో కూడా పరిశుభ్రత చర్యలు చేపట్టి ఎటువంటి వ్యాధులు రాకుండా చూడాలన్నారు. అదేవిధంగా గ్రామాలలో నీరు నిలువ ఉండకుండా చూడాలని అన్నారు. దీనికి సంబంధించి అందరూ సమిష్టిగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇళ్లల్లో నీరు నిల్వ ఉండకుండా వాలంటీర్ల సహాయంతో తగు చర్యలు చేపట్టాలని అన్నారు.
వాటర్‌ ట్యాంకులు 15 రోజులకు ఒకసారి శుభ్రం చేయాలని తనిఖీలు చేయాలని ఆదేశించారు. ట్యాంక్‌ వద్ద శుభ్రం చేసిన తేదీ తదుపరి 15 రోజులకు శుభ్రం చేయాల్సిన తేదీని వేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని వారు ఆరోగ్యంగా ఉండాలంటే గ్రామాలలో నిత్యం పర్యటిస్తూ పరిశుభ్రత చర్యలను పర్యవేక్షిస్తూ తగిన జాగ్రత్తలు చెప్పాలని అన్నారు. జిల్లాలో మొత్తం 3492 వాటర్‌ ట్యాంకులు ఉన్నాయి అని ఈ వాటర్‌ ట్యాంకులను ప్రతి 15 రోజులకోసారి శుభ్రం చేసి లీకేజీలు ఏవైనా ఉంటే గుర్తించి వెంటనే తగు చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రాపర్టీ టాక్స్‌ విషయంలో జాగ్రత్తగా పరిశీలించి అందరూ పనులు చెల్లించేలా చూడాలని అన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌ కార్యక్రమంలో డిపిఓ లక్ష్మీతోపాటు మండలాలలోని ఈవోపీఆర్డీలు పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.