మాట్లాడుతున్న జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎం.పెంచలయ్య,
సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన
ప్రజాశక్తి-నెల్లూరు:రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 'జగనన్న ఆరోగ్య సురక్ష' కార్యక్రమంలో భాగంగా వైద్య ఆరోగ్య సిబ్బంది ప్రజలకు సీజనల్ వ్యాధుల పట్ల పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎం.పెంచలయ్య, డిఎంఓ ఈ హుస్సేనమ్మలు పిలుపునిచ్చారు. బుధవారం నగరంలోని ఎన్‌బిటి కాలనీలో నిర్వహిస్తున్న 'జగనన్న ఆరోగ్య సురక్ష' కార్యక్రమాన్ని వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వైద్యాధికారులు సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ వైద్యసేవల నిమిత్తం వస్తున్న వారిలో జ్వరపీడితులను గుర్తించి డెంగ్యూ, మలేరియా రాపిడ్ పరీక్షలు నిర్వహించాలన్నారు. అవసరమైన వారికి రక్తపరీక్షలు సైతం నిర్వహించాలన్నారు. ఇంటింటికి వెళ్తున్న ఆశా కార్యకర్తలు,ఎఎన్‌ఎం లు ప్రజలకు సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించాలని, ఇంటి చుట్టు ప్రక్కల, ఇంటి లో నీటి నిల్వలు లేకుండా చూడాలన్నారు. ముఖ్యంగా ఫ్రైడే డ్రై డే కార్యక్రమాన్ని ప్రతి ఇంటిలో క్రమం తప్పకుండా నిర్వహించేలా ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. వ్యాధులకు కారణమౌతున్న దోమల పెరగకుండా, లార్వా దశలోనే గుర్తించి ఇంటి యజమానులు తొలగించే విధముగా అవగాహన కల్పించాలన్నారు. అనంతరం ల్యాబ్ ను పరిశీలించి ఎఎన్‌ఎం లు ఇచ్చే రక్త నమూనాలను ఎప్పటికప్పుడు పరీక్ష చేసి ఫలితాలను ప్రజలకు అందజేయాలన్నారు. ల్యాబ్ టెక్నీషియన్ రిజిస్టర్లు, రికార్డులు పరిశీలించి తగిన సలహాలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ మున్సిపల్ కమీషర్ సర్మద , ఎన్‌బిటి కాలనీ అర్బన్ హెల్త్ సెంటర్ వైద్యాధికారి జి.హారిక, మలేరియా విభాగం సూపర్‌వైజర్ శ్రీధర్, హెల్త్ అసిస్టెంట్ నంద కుమార్, కోర్డినేటర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.










