వ్యాక్సినేషన్ తప్పనిసరి
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి :కలెక్టర్
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్:
అర్హులందరూ తప్పక వ్యాక్సిన్ చేయించుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణన్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో జిల్లా కలెక్టర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖఅధికారి డాక్టర్ ఆర్‌ఆర్.రెడ్డి, డిసిహెచ్‌ఎస్ (ఇంచార్జ్) పాల్ రవికుమార్, జిల్లా మలేరియా అధికారి శ్రీనివాసులు, చిత్తూరు జిల్లా ప్రధాన ఆసుపత్రి అపోలో ఇంచార్జ్ నరేష్ కుమార్ రెడ్డి, ఇతర సంబంధిత అధికారులతో వ్యాక్సినేషన్, సీజనల్ వ్యాధులపట్ల ప్రజలకు అవగాహన కల్పించే అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వ్యాక్సినేషన్‌కు అర్హులైన వారందరికీ వ్యాక్సిన్ వేసేలా క్షేత్రస్థాయిలో సిబ్బంది పనిచేయాలని, వ్యాక్సినేషన్‌కు అర్హత ఉండి వేయించుకోని వారందరికీ తప్పక వ్యాక్సిన్ వేయాలని సూచించారు. అలాగే సీజనల్ వ్యాధులైన మలేరియా, డెంగ్యూ ప్రబలకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని, క్షేత్రస్థాయిలో డ్రైడే పాటించేలా వైద్యఆరోగ్య సిబ్బంది పోస్టర్లు, బ్యానర్లు, ప్రచారం చేయాలన్నారు. ఈ అంశంలో మండలస్థాయిలో ఎంపిడిఓలు, మునిసిపల్ స్థాయిలో మునిసిపల్ కమీషనర్లు వైద్యఆరోగ్యశాఖతో సమన్వయం చేసుకుని పనిచేయాలన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు హెల్త్‌కేర్ వర్కర్లకు సంబంధించి ప్రికాషినరీ డోస్ లక్ష్యం 13,622 కాగా 12,826 మందికి వ్యాక్సినేషన్ చేయడం జరిగిందని, ఫ్రంట్ లైన్ వర్కర్‌లకు 34,036 మందికి లక్ష్యం కాగా 29,106 మందికి వ్యాక్సినేషన్ చేయడం జరిగిందని, 60 సంవత్సరాలుపై బడిన వారికి 1,53,000 మంది లక్ష్యం కాగా 1,36,505 మందికి వ్యాక్సిన్ వేయడం జరిగిందన్నారు. అలాగే 12 నుండి 14 సంవత్సరాల పిల్లలకు కార్బోవ్యాక్స్ వ్యాక్సిన్ 2,67,000 జిల్లాకు అందగా 2,52,840 డోసులు ఖర్చు చేయడం జరిగిందన్నారు. జిల్లాలో మలేరియా, డెంగ్యూ కేసులు నమోదు కాకుండా ముందస్తు చర్యలు చేపదుతున్నామని డిఎం అండ్ హెచ్‌ఓ కలెక్టర్‌కు వివరించారు.










