Aug 28,2022 23:14

సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి రవిరాజు
ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌

సహజంగా వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులు ప్రభులే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి రవిరాజు తెలిపారు. వర్షాకాలంలో వాతావరణంలో చోటుచేసుకునే మార్పుల ఫలితంగా సీజనల్‌ వ్యాధులైన మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్‌, చికెన్‌ గున్యా వంటి వ్యాధులతో పాటు విషజ్వరాలు ప్రభలే అవకాశం అధికంగా ఉంటుందని ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు కాచి వడగాచిన నీటిని తీసుకోవడం మంచిదని సూచించారు.
ప్రజాశక్తి: సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి...?
ఇమ్యునైజేషన్‌ అధికారి: వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశం అధికంగా ఉంటుంది. దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సురక్షితమైన నీటిని తాగాలి. చిన్నపాటి జ్వరం వచ్చిన వైద్యులను సంప్రదించడం మంచిది.
ప్రజాశక్తి: గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి చర్యలు చేపడుతున్నారు...?
ఇమ్యునైజేషన్‌ అధికారి: గ్రామీణ ప్రాంతాల్లో సీజనల్‌ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతోంది. పిహెచ్‌సి, సిహెచ్‌సి వైద్యులను అప్రమత్తం చేశాం. తగిన మందులను సరఫరా చేసి అందుబాటులో ఉంచాం. ఓవర్‌ హెడ్‌ ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ బ్లీచింగ్‌ పౌడర్‌తో క్లోరినేషన్‌ చేయాలని ఆదేశించడం జరిగింది.
ప్రజాశక్తి: పిహెచ్‌సి మందులు అందుబాటులో ఉన్నాయా...?
ఇమ్యునైజేషన్‌ అధికారి: జిల్లాలోని ప్రతి పీహెచ్సీల్లో సీజనల్‌ వ్యాధులకు అందించే మందులను సరఫరా చేసి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవడం జరిగింది. 104 వాహనాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలు అందిస్తున్నాం. వైరల్‌ ఫీవర్‌ వచ్చినప్పుడు తగిన టెస్టులు నిర్వహించేందుకు పీహెచ్సీలో అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి.
ప్రజాశక్తి: ఆసుపత్రుల్లో నాడు- నేడు కార్యక్రమం ఎలా జరుగుతోంది.
ఇమ్యునైజేషన్‌ అధికారి: రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నాడు- నేడు కార్యక్రమం అమలవుతోంది. ఈకార్యక్రమంలో ఆసుపత్రుల ఆధునీకరణ, మరుగుదొడ్ల నిర్మాణం, మౌలిక వసతుల కల్పన కోసం నిధులను ఖర్చు చేయడం జరుగుతుంది.
ప్రజాశక్తి : సీజనల్‌ వ్యాధుల పట్ల ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారా...?
ఇమ్యునైజేషన్‌ అధికారి: గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు సీజనల్‌ వ్యాధులపట్ల వైద్యబందం అవగాహన కల్పించడం జరుగుతోంది. ఏఎన్‌ఎంలు, ఆశాలు, అంగన్వాడీ కార్యకర్తల ద్వారా గ్రామీణ ప్రజలకు సీజనల్‌ వ్యాధులపట్ల అవగాహన కల్పిస్తున్నాం. తగిన జాగ్రత్తలు తీసుకొని ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని నీటి నిలువలు ఇంటి చుట్టూ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నాము. ముఖ్యంగా చిన్నపిల్లలు వద్ధుల విషయాల్లో అత్యంత జాగ్రత్త అవసరం.