సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆర్‌ఆర్ రెడ్డి
ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్:
ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో వాతావరణం చల్లబడి సీజనల్ వ్యాధులు ప్రభలే ప్రమాదం ఉంది. అందకే సీజనల్ వ్యాధులను అరికట్టడం ప్రత్యేకదృష్టి సారిస్తున్నాం. అన్ని విభాగాలను సమన్వయం చేసుకొని సీజనల్ వ్యాధుల ప్రభల కుండా వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు అప్రమత్తం చేస్తున్నాం. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రభల కుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించి వైద్యఆరోగ్యశాఖకు పూర్తి సహకారం అందించాలని జిల్లావైద్య ఆరోగ్యశాఖాధికారి ఆర్‌ఆర్. రెడ్డి కోరారు. ప్రజాశక్తి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్య్వూలో విషయాలను తెలియజేశారు.
ప్రజాశక్తి : సీజనల్ వ్యాధులు ప్రభల కుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు...?
డిఎంఅండ్‌హెచ్‌ఒ: ముఖ్యంగా డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి విషజ్వరాలు వర్షాకాలంలో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. విషజ్వరాలను నివారించేందుకు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు దోమలు కుట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పిహెచ్‌సీల్లోని వైద్యలు, సిబ్బంది సమయపాలన పాటించి ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించడం జరిగింది. అలాగే వెల్‌నెస్ కేంద్రాల ద్వారా ప్రభుత్వం నిర్ధేశించిన సేవలన్నీ అందిస్తూ వైద్యసేవల్లో వైద్యధికారులు, సిబ్బంది నిర్లక్షంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
ప్రజాశక్తి: వైద్యరంగంలో ఎప్పుడు చేరారు.....?
డిఎంఅండ్‌హెచ్‌ఒ: ఏర్పేడులోని లెప్రసీ సెంటర్‌లో 1988 నుంచి పదేళ్లపాటు విధులు నిర్వహించాను. ఆ సమయంలోనే పీజీలో చేరా యూపీలోని కాన్పూరులో ఆర్‌ఐఓ చదివాను. తమిళనాడులోని ఓ హాస్పిటల్‌లో ఎంబీఏ పూర్తిచేసి 1998లో ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. మదనపల్లిలోని లెప్రసీ యూనిట్‌లో తొలిసారి బాధ్యతలు చేపట్టాను. 2002లో పీలేరులోని లెప్రసీ ఆసుపత్రిలో చేరాను. అదే ఏడాది డిసెంబర్‌లో రుయా ఆసుపత్రికి మార్చారు. అక్కడే 2012లో డిప్యూటీ డీఎంహెచ్‌ఓగా ఉద్యోన్నతి పొందాను. 2017లో చిత్తూరు డిఐఓగా, 2018లో రుయా ఆర్‌ఎంఓగా పనిచేశాను. 2019-21 మధ్య టిటిడిలో హెల్త్ ఆఫీసర్‌గా, 2021 ఆగస్టు నుంచి కంటి వెలుగు జేడీగా విధులు నిరవర్తించి ఉద్యోన్నతిపై చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిగా అవకాశం వచ్చింది.
ప్రజాశక్తి: కుటుంబ నియంత్రణ కోసం తీసుకుంటున్న చర్యలేమిటి...?
డిఎంఅండ్‌హెచ్‌ఓ: జూలై 11వ తేదీ ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని మొదటి విడతలో జూన్ 26వ తేదీ నుంచి జూలై 10వ తేదీ వరకు అలాగే జూలై 11 నుంచి 24వ తేదీ వరకు జనాభా స్థిరీకరణ పక్షత్సవాలు నిర్వహించడం జరుగుతోంది. వివాహ వయసు, కుటుంబ నియంత్రణ పద్ధతులు, బిడ్డకు బిడ్డకు ఎడంపై అవగాహన కల్పింస్తున్నాం. ప్రతి కుటుంబ సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం, జనాభా నియంత్రణ అందరి బాధ్యత కుటుంబ నియత్రణ పద్ధతులపై ప్రజల్లో విసృతంగా అవగాహన కల్పించడం జరుగుతోంది.
ప్రజాశక్తి: జిల్లా కేంద్రమైన చిత్తూరులో డెంగ్యూ కేసులు నమోదు కావడం జరిగింది. ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు.?
డిఎంఅండ్ హెచ్‌ఓ: చిత్తూరు నగరంలోని కట్టమంచి, ప్రశాంత్‌నగర్, టెలిఫోన్ కాలనీ ప్రాంతాల్లో డెంగ్యూ పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఆప్రాంతాల్లో పారిశుధ్య చర్యలు చేపట్టాం. నగర పాలక సంస్థను అప్రమత్తం చేసి తాత్కాలిక వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి వైద్యపరీక్షలు నిర్వహించడం జరిగింది. డెంగ్యూ సోకిన వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నాము.
ప్రజాశక్తి: ప్రస్తుత చిత్తూరు జిల్లాలో సేవలు అందిస్తున్న వైద్యశాలలు ఎన్ని ఉన్నాయి...?
డిఎంఅండ్‌హెచ్‌ఓ: జిల్లాలో జిల్లా ఆసుపత్రి ఒకటి నవజాతశిశు సంరక్షణ కేంద్రం ఒకటి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 50, 24-7 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 20, నాన్ 24-7 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 30, సబ్ సెంటర్లు 613, సామాజిక ఆరోగ్య కేంద్రాలు 7, ప్రాంతీయ వైద్యశాలలు 3, పట్టణ ఆరోగ్య కేంద్రాలు 14, రక్తనిధి కేంద్రాలు 2 ద్వారా వైద్య సేవలు అందిండం జరుగుతోంది.










