Apr 03,2022 22:47

విద్యార్థులను సన్మానిస్తున్న మాజీ మంత్రి అమరనాథ రెడ్డి

ప్రజాశక్తి-పలమనేరు: ప్రతి ఒక్కరిలో ప్రతిభ దాగి ఉంటుందని అయితే ఎవరైతే తమలో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి అందులో రాణించగలుగుతారో అలాంటి వారు జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని మాజీ మంత్రి అమరనాథ రెడ్డి పేర్కొన్నారు. ది ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కాస్ట్‌ అకౌంట్స్‌ ఆఫ్‌ ఇండియా విడుదల చేసిన ఫలితాలలో ఈ ప్రాంతానికి అరుదైన గౌరవాన్ని తీసుకొచ్చిన పలమనేరు పట్టణానికి చెందిన వ్యాపారవేత్తలు రాజేష్‌, లక్ష్మీపతిల కుమారులు రిషబ్‌ ఓత్సవాల్‌, సాయి శ్రీనివాస్‌లు జాతీయ స్థాయిలో మొదటి, రెండవ ర్యాంకులను సాధించడం, సీఎ ఫలితాలలో 8, 10వ ర్యాంకుల్లో రాణించడంతో ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో వారిని సన్మానించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.... ప్రతిభ ఉన్న వారిని మనం గుర్తించి ప్రోత్సహించాలని అలా చేయడం వల్ల మరిన్ని ఉన్నత స్థానాలను వారు చేరగలుగుతారన్నారు. ప్రతిభ కనబర్చిన వారిని అభినంధించి ప్రోత్సహించడం పిల్లల తల్లిదండ్రులతో పాటు మన కనీస బాధ్యత అని, అలాంటి ప్రోత్సాహం లభించినపుడు వారు పడిన కష్టానికి ఫలితం దక్కినట్టేనన్నారు. జాతీయ స్థాయిలో పలమనేరుకు గుర్తింపు తీసుకొచ్చిన రిషబ్‌, సాయి శ్రీనివాస్‌లను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా నన్నారు. ఇలాంటి వారిని ఆదర్శంగా తీసుకొని మరింత మంది ప్రతిభ కనబరచాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాజేష్‌, లక్ష్మీపతి లతో పాటు టీడీపీ నాయకులు బ్రహ్మయ్య, గిరిబాబు, ఖాజా, సుబ్రహ్మణ్యం గౌడ్‌, మదన్‌, కోటేశ్వర్‌, మాబాషా తదితరులు ఉన్నారు.
పలమనేరు : సీఏ ఐపీసీసీ పరీక్ష ఫలితాల్లో.... జాతీయ స్థాయిలో 8, 10వ ర్యాంకు సాధించి, అదే విధంగా, సీఎంఎ పరీక్షా ఫలితాలలో, మొదటి, రెండవ ర్యాంకు సాధించిన రిషబ్‌, శశి శ్రీనివాస్‌లను గణేష్‌ యాదవ్‌ అభినందించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులకు, తన శుభాకాంక్షలు తెలియజేశారు.