సిఎం పర్యటనకు సర్వం సిద్ధం
ప్రజాశక్తి- కుప్పం:
చిత్తూరు జిల్లా కుప్పం వేదికగా ఈనెల 23న శుక్రవారం నిర్వహించనున్న వైఎస్ ఆర్ చేయూత మూడవ విడత నగదు జమ రాష్ట్రస్థాయి కార్యక్రమ నిర్వహణకు సర్వం సిద్ధం అయ్యింది. ఈమేరకు జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. హెలిప్యాడ్, అనిమిగానిపల్లి వద్ద జరిగే బహిరంగసభలో వైఎస్‌ఆర్ చేయూత లబ్ధిదారులు, ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొననున్నందున పటిష్టంగా గ్యాలరీల నిర్వహణ, తాగునీటి సదుపాయం తదితర ఏర్పాట్లు, కుప్పం చెరువు వద్ద పటిష్ట భధ్రతా ఏర్పాట్లు, హెలిప్యాడ్ వద్ద గ్రీన్ రూమ్‌తో పాటు బ్యారీకేడింగ్, ఇతరత్రా అన్ని సౌకర్యాలు నిర్మితమయ్యాయి.
బహిరంగ సభ వద్ద ఏర్పాట్ల పరిశీలన
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్‌రెడ్డి పాల్గొననున్న బహిరంగ సభ ఏర్పాట్లను గురువారం ఉదయం రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మరియు రాష్ట్ర ఎక్సైజ్ శాఖామాత్యులు కె.నారాయణస్వామి, లోక్‌సభ ప్యానెల్ స్పీకర్ మరియు రాజంపేట పార్లమెంట్ సభ్యులు పివి.మిథున్‌రెడ్డి, చిత్తూరు పార్లమెంట్ సభ్యులు ఎన్.రెడ్డెప్ప, ముఖ్యమంత్రి పర్యటన సమన్వయకర్త తలశిల రఘురామ్, కలెక్టరు యం. హరినారాయణన్, ఎస్పీ రిషాంత్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, పలమనేరు శాసనసభ్యులు ఎన్.వెంకటేగౌడ, ఎమ్మెల్సీ భరత్, జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్, డిఆర్‌ఓ ఎన్.రాజశేఖర్‌లతో కలిసి పరిశీలించారు. కార్యక్రమ ఏర్పాట్లలో భాగంగా బహిరంగ సభ వేదిక వద్ద ఎల్‌ఈడీ స్క్రీన్‌లు, బ్యారి కేడింగ్, పార్కింగ్, సీటింగ్, సభకు వచ్చే లబ్ధిదారులకు తాగునీటి వసతి, శానిటేషన్ తదితర సౌకర్యాలను పరిశీలించి సంతప్తి వ్యక్తం చేశారు. మంత్రులతో పాటు ఆర్‌డిఓ శివయ్య, పికెఏం ఉడా ఛైర్మన్ వెంకట్‌రెడ్డి యాదవ్, రెస్కో ఛైర్మన్ సెంధిల్ కుమార్, కుప్పం మున్సిపల్ ఛైర్మన్ డాక్టర్ సుధీర్, రాష్ట్ర వన్నెకుల క్షత్రియ కార్పొరేషన్ ఛైర్మన్ వనిత, ఎంపిపి అశ్విని, జెడ్‌పిటిసి శరవణ, డిఆర్‌డిఏ మరియు డ్వామా పిడిలు తులసి, చంద్రశేఖర్, సమగ్ర శిక్ష ఏపిసి వెంకట రమణారెడ్డి, డిఈ ఓ పురుషోత్తం, డిపిఓ లక్ష్మి, ఐసిడిఎస్ పిడి నాగ శైలజ, ఇతర జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.










