ప్రజాశక్తి - యలమంచిలి
మండలంలోని కలగం పూడిలో సిఎం జగన్ ఈ నెల ఐదో తేదీ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని అధికారులను కలెక్టర్ ప్రశాంతి ఆదేశించారు. శాఖలవారీగా పనులన్నింటినీ ఈ నెల మూడో తేదీ సాయంత్రానికి పూర్తి చేయాలని, ఎటువంటి లోటుపాట్లూ ఉండరాదని స్పష్టం చేశారు. ప్రభుత్వ చీప్ విప్ ముదునూరి ప్రసాదరాజు కుమార్తె వివాహానికి జగన్ రానున్న నేపథ్యంలో ఏర్పాటు చేస్తున్న హెలీప్యాడ్‌ను గురువారం కలెక్టర్ ప్రశాంతి, ఎస్‌పి రవిప్రకాష్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హెలీప్యాడ్ నుండి కళ్యాణ వేదిక వరకూ పూర్తి శానిటేషన్, పూలమొక్కలతో సుందరీకరణ చేయాలన్నారు. అన్నిచోట్లా బారీకేడ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ పరిశీలనలో చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు, ఇన్‌ఛార్జి జెసి ఎం.సూర్యతేజ, అధికారులు పాల్గొన్నారు.










