Jul 11,2022 22:46

సిఎం హామీలను నెరవేర్చాలి
కనీస వేతనం ఇవ్వాలి
జిల్లావ్యాప్తంగా పారిశుధ్య కార్మికుల సమ్మె
ప్రజాశక్తి - చిత్తూరు అర్బన్‌, కుప్పం, పుంగనూరు

మున్సిపల్‌ కార్పొరేషన్‌లో పనిచేస్తున్న పారిశుధ్య విభాగం, ఇంజినీరింగ్‌ విభాగంలోని కార్మికుల న్యాయమైన సమస్యల పరిష్కారానికి రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు పారిశుధ్య కార్మికులు సోమవారం నుంచి సమ్మె ప్రారంభించారు. జిల్లావ్యాప్తంగా సమ్మె చేపట్టారు. చిత్తూరు గాంధీ విగ్రహం ఎదుట పారిశుధ్య కార్మికులు చేస్తున్న సమ్మెకు సిఐటియు జిల్లా అధ్యక్షులు వాడా గంగరాజు మద్దతు ప్రకటించారు. వాడా గంగరాజు, ఎఐటియుసి నాయకులు నాగరాజు మాట్లాడుతూ మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వానికి నిర్లక్ష్యం తగదన్నారు. రెండు నెలల క్రితమే సమస్యలు పరిష్కరించాలని కోరినా పట్టించుకోలేదన్నారు. కార్మికుల సమ్మెకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. కాంట్రాక్ట్‌ ఔట్సోర్సింగ్‌ కార్మికులను పర్మినెంట్‌ చేయాలని, పర్మినెంట్‌ కార్మికులకు సిపిఎస్‌ రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కాంట్రాక్ట్‌ కార్మికులకు పిఆర్సి ప్రకారం నెలకు 20వేల జీతం, కరువు భత్యం ఇవ్వాలన్నారు. పనిముట్లు , యూనిఫాంం, సోపు, సబ్బు, నూనె, చెప్పులు ఇవ్వాలని, కాంట్రాక్ట్‌, ఔట్సోర్సింగ్‌ కార్మికులకు ఒకే రకమైన జీతాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు.
కుప్పంలో సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు విధులను బహిష్కరించి సమ్మెకు పూనుకున్నారు. మున్సిపల్‌ కార్మికులను రెగ్యులర్‌ చేయడంతో పాటు, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కుప్పం నియోజకవర్గ అధ్యక్షులు గోవిందరాజు, కార్యదర్శి పార్థీభన్‌ మాట్లాడుతూ సిఎం జగన్మోహన్‌రెడ్డి గతంలో ఇచ్చిన హామీలనే నెరవేర్చాలని కోరుతున్నామన్నారు. నరసింహులు, భరత్‌, గుణశేఖర్‌, మంజు, హేమవతి, వెంకటేష్‌ పాల్గొన్నారు. పుంగనూరులో సిపిఐ నాయకులు టి.జనార్ధన్‌ పాల్గొన్నారు. జనవరి నుంచి పారిశుధ్య కార్మికులకు హెల్త్‌ అలవెన్స్‌ నిలిపేశారన్నారు. రెడ్డెమ్మ, హరి, ధర్మారెడ్డి, వెంకటరమణ పాల్గొన్నారు. నగరిలో ఏఐటియుసి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య ఆధ్వరొయలో మున్సిపాలిటీ కార్పొరేషన్‌లో పనిచేయు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సమ్మెలో పాల్గొన్నారు.