Oct 14,2023 22:04

సిఐటియు జాతీయ సెమినార్‌ వాయిదా

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌: జిల్లా కేంద్రంలో ఈనెల 15,16న జరపతలపెట్టిన జాతీయ సెమినార్‌ వాయిదా వేసినట్టు సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సిహెచ్‌.అమ్మన్నాయుడు, పి.తేజేశ్వర రావు, శ్రామిక మహిళ జిల్లా కన్వీనర్‌ కె.నాగమణి తెలిపారు. ఈమేరకు సిఐటియు జిల్లా కార్యాలయంలో వారు శనివారం విలేకరులతో మాట్లాడారు. సిఐటియు జాతీయ నాయకులు పర్సా సత్యన్నారాయణ శతజయంత్యుత్సవాల్లో భాగంగా ఈ సెమినార్‌ నిర్వహించాల్సి ఉందన్నారు. ముఖ్య వక్తలు సిఐటియు జాతీయ అధ్యక్షులు డాక్టర్‌ కె.హేమలత, రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎ.వి.నాగేశ్వరరావు, సిహెచ్‌.నర్సింగరావు, వివిధ కార్మిక సంఘాల నాయకులు అనివార్య కారణాల వల్ల హాజరు కాలేకపోతున్నందున ఈ సెమినార్‌ వాయిదా వేశామని అన్నారు. ఈ కార్యక్రమాన్ని తిరిగి నిర్వహించే తేదీలను వెల్లడిస్తామన్నారు. పాలకులు అనుసరిస్తున్న ఉద్యోగ, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, సమస్యలు పరిష్కారానికి, హక్కుల పరిరక్షణకు సిఐటియు అనేక పోరాటాలు నిర్వహిస్తుందన్నారు. ప్రజాధనంతో నిర్మించిన విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌, రైల్వే, బిఎస్‌ఎన్‌ఎల్‌, బ్యాంకులు, ఇన్స్యూరెన్స్‌, పోస్టల్‌ తదితర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాలను నిర్వహిస్తున్నామని అన్నారు. కార్మిక వర్గం తరతరాలుగా పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 4 లేబర్‌ కోడ్స్‌ మార్చి కార్మికులను ఆధునిక బానిసలుగా మారుస్తున్నాయని అన్నారు. లేబర్‌ కోడ్‌లకు వ్యతిరేకంగా సిఐటియు అనేక ఐక్య ఉద్యమాలు నిర్వహిస్తుందని తెలిపారు. వివిధ రంగాల కార్మికులు, మున్సిపల్‌, పంచాయతీ, కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు, అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం, విఒఎ తదితర స్కీం వర్కర్లు, విఆర్‌ఎ, భవన నిర్మాణ, హమాలీ తదితర కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలని పోరాటం చేస్తున్నారని అన్నారు.