Mar 29,2022 23:12

సస్పెండైన సిఐ అమర్‌నాధ రెడ్డి


హత్య కేసు దొరికిందంటే పండగే
ప్రజాశక్తి - తిరుపతి బ్యూరో
ఆయన పేరు అమరనాథరెడ్డి.. ట్రాఫిక్‌ పోలీసు స్టేషన్‌లో ఎస్‌ఐగా ఉండేవాడు. ఉద్యోగం మాత్రం చాలా స్ట్రిక్ట్‌గా చేసేవాడు. ఇంటిదగ్గర నుంచే క్యారియర్‌ తెచ్చుకుని భోంచేసేవాడు. సాదాసీదాగా ఉండేవాడు. కనీసం 'ప్రెస్‌' వాహనమైనా కేసు నమోదు చేసేవాడు. అంతటి నిజాయతీగా ఉన్న ఎస్‌ఐ సిఐగా ఉద్యోగోన్నతి పొందాక మద్దిస్తాల పోలీసుగా మారిపోయారు. గాజులమండ్యం సిఐగా రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నాడు. అతనికి ఆ సర్కిల్‌ బాగా కలిసొచ్చింది. కడప - నెల్లూరు - తిరుపతి - చెన్నరు రింగ్‌ రోడ్డు కావడంతో బాగా 'రింగ్‌' అయ్యేవాడు. ఏ వాహనం వెళ్లినా దందానే. ప్రత్యేకించి రామచంద్రాపురం మండలం ఫ్యాక్షనిస్టును తలపిస్తుంది. నెల్లూరు దగ్గర ఎర్రమట్టి తరలింపులో వాటా ఉంది. ఇసుక మాఫియాతోనూ సంబంధం ఉంది. కాంట్రాక్టర్లు నెలానెలా మామూళ్లు సమర్పించాల్సిందే. రామచంద్రాపురం మండలంలో హత్య జరిగినా, ఆత్మహత్య జరిగినా డబ్బు అందాల్సిందే. లేదంటే కేసు బుక్‌ చేస్తామని బెదిరిస్తారు. బంధువులను పిలిపించి వేధింపులకు పాల్పడతాడన్న పేరుంది. ఇటీవల అనుప్పల్లి పంచాయతీ గడ్డకిందపల్లి గ్రామంలో గుర్రం వెంకటేష్‌రెడ్డి భార్యను అనుమానించి గొంతు కోశాడు. అతనూ గొంతు కోసుకుని చనిపోయాడు. అయితే ఆ కేసులో ఇతను కీలకంగా వ్యవహరించాడు. పది లక్షలపైనే బంధువుల దగ్గర లంచం తీసుకున్నట్లు సమాచారం. ఆ రెండు ఘటనలనూ ఆత్మహత్యగా చిత్రీకరించాడని తెలుస్తోంది. వేపకుప్పంలో ఓ మహిళను హత్య చేశారు. దాన్నీ ఆత్మహత్యగా చిత్రీకరించాడు. ఇప్పటివరకూ ఆయన సంపాదించిన అక్రమ డబ్బు రెండు కోట్లపైనే ఉంటుందని సమాచారం. తాజాగా హేమసుందరం హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించి అర్బన్‌ ఎస్‌పి వెంకటప్పలనాయుడుకు అడ్డంగా దొరికిపోయాడు. అతన్ని సస్పెండ్‌ చేయడంపై రామచంద్రాపురం వాసులు హర్షం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.