Nov 01,2023 22:39

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌
'మాట తప్పను.. మడమ తిప్పను' అని చెప్పుకునే సిఎం జగన్మోహన్‌రెడ్డి జిల్లాకేంద్రమైన చిత్తూరుకు ప్రతిపక్ష నేతగా ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించారు. మూతబడిన విజయ డెయిరీని అమూల్‌కు 99 ఏళ్లపాటు లీజ్‌కు ఇస్తూ కట్టబెట్టేశారు. సహకార చక్కెర ఫ్యాక్టరీ పున్ణప్రారంభించే ఊసే లేకుండా పోయింది. అధికారంలోకి రాక ముందు సరే.. అధికారంలోకి వచ్చాక ఏడాది క్రితం జిల్లాకేంద్రానికి వచ్చిన జగన్మోహన్‌రెడ్డి ఒక్కో సచివాలయానికి 50 లక్షల చొప్పున నిధులను కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఒక్క రూపాయి ఇస్తే ఒట్టు.. ప్రధాన హామీలన్నీ గాలికొదిలేసి సామాజిక బస్సు యాత్ర పేరిట గురువారం జనంలోకి రావడం గమనార్హం.
సార్వత్రిక ఎన్నికలకు ముందు 2018, జనవరి 7న చంద్రగిరి నియోజకవర్గం దామలచెరువులో రైతులతో ముఖాముఖి నిర్వహించారు. అనంతపురం జిల్లా నుండి ఉమ్మడి చిత్తూరు జిల్లా తంబళ్లపల్లిలోకి ప్రవేశించిన జగన్మోహన్‌రెడ్డి పాదయాత్ర తంబళ్లపల్లి మీదుగా సదుంలో బహిరంగసభలో పాల్గొని, దామలచెరువులో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు భారీగా హామీలు ఇచ్చారు. చంద్రబాబు హెరిటేజ్‌ ఫ్యాక్టరీ వల్ల మూతబడిన విజయ డెయిరీని అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో తెరిపిస్తామని, పాడి రైతులకు లీర్‌ పాలపై రూ.4 బోనస్‌ అందిస్తామని వెల్లడించారు. అయితే సహకార విజయ డెయిరీని 99 ఏళ్ల పాటు అమూల్‌ సంస్థకు అప్పగించారు. చిత్తూరు, రేణిగుంట సహకార చక్కెర ఫ్యాక్టరీలను తెరిపిస్తామని భరోసా ఇచ్చారు. చెరకు రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామన్న హామీ హామీగానే మిగిలిపోయింది.
రెండు సార్లు చిత్తూరులో పర్యటించిన సిఎం
ముఖ్యమంత్రిగా చిత్తూరు నగరానికి జగన్‌మోహన్‌రెడ్డి రెండు సార్లు చిత్తూరులో పర్యటించి భారీ బహిరంగ సభల్లో ప్రసగించారు. మొదటిసారి అమ్మఒడి పథకాన్ని చిత్తూరు నగరం నుండీ ప్రారంభించారు. రెండో సారి విజయా సహకార డెయిరీని అమూల్‌ సంస్థకు అప్పగిస్తూ పోలీస్‌ క్రీడామైదనంలో నిర్వహించిన బహిరంగ సభలో చిత్తూరు అభివృద్ధికోసం చిత్తూరు మున్సిపల్‌ నగర పాలక సంస్థ పరిధిలోని ఒక్కో డివిజన్‌కు అభివృద్ధి పనుల కోసం 50 సచివాలయాకు ఒక్కో సచివాలయానికి రూ. 50 లక్షలు మంజురు చేస్తూ హామీ ఇచ్చి ఏడాదికి పైగా గడుస్తున్నా వైకాపాలోని గ్రూపు రాజకీయాలతో సిఎం మంజూరు చేసిన నిధులు ఖర్చు చేయలేని పరిస్థితి నెలకొంది. నగర పాలక సంస్థలో గుర్తించిన మురికివాడలు కనీస మౌలిక వసతులకు నోచుకోవడం లేదు. నగర పాలక సంస్థ కౌన్సిల్‌ సమావేశం సాక్షిగా అధికార పార్టీ కౌన్సిలర్లు బాహాబాహిగా తలపడ్డారు... విజయ సహకార డెయిరీ కార్మికులు బకాయి వేతనాల కోసం 46 రోజులుగా కలెక్టరేట్‌ ఎదుట రిలే నిరాహార దీక్షలు కొనసాగుతూనే ఉన్నాయి.
నేడు సామాజిక సాధికార బస్సు యాత్ర
మరో మారు అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గురువారం చిత్తూరు నగరంలో సామాజిక సాధికార బస్సు యాత్ర పేరుతో ప్రజల ముందుకు వస్తోంది. మంత్రులు నారాయణస్వామి, పెద్డిరెడ్డి రామచంద్రారెడ్డిలతో పాటు ఎంపిలు, ఎంఎల్‌ఏలు వైకాపా నాయకులు ఈ బస్సు యాత్రలో పాల్గొంటున్నారు. నగరంలోని నాగయ్య కళాక్షేత్రంలో ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీలతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో పాదయాత్ర సందర్భంగా ప్రస్తుత ముఖ్య మంత్రి నాటి ప్రతిపక్ష నేత జగన్‌ మోహ
న్‌రెడ్డి ఇచ్చిన చిత్తూరు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారు. చిత్తూరుకు యూనివర్శిటి మంజురు చేయడంతో పాటు నగర పాలక సంస్థ పరిధిలోని మురికివాడల్లో మౌళిక వసతులు కల్పించడంతో పాటు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేలా పరిశ్రమలు ఏర్పాటు చేయాలని చిత్తూరు నగర వాసులు కోరుతున్నారు. సామాజిక సాధిక బస్సు యాత్ర పేరుతో జనంలోకి వస్తున్న అధికార పార్టీ నేతలు నేటి దళిత వాడల్లో కొనసాగుతున్న కుల వివక్షను రూపుమాపడం, స్మశాన వాటికలు ఏర్పాటు, ఎస్సీ, ఎస్టీ, బీసి, మైనార్టీలపై చోటు చేసుకుంటున్న హత్యలు, అత్యాచారాలు అరికట్టేలా బస్సు యాత్రలో ప్రసంగించాలని కోరుతున్నారు.