Sep 12,2023 21:54

మాట్లాడుతున్న డ్వామా పీడీ చిట్టిరాజు

*డ్వామా పీడీ జి.వి చిట్టిరాజు
ప్రజాశక్తి - మెళియాపుట్టి
:ఉపాధి హామీ సగటు కూలి పెంపులో నిర్లక్ష్య ధోరణి సరికాదని జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు జి.వి చిట్టిరాజు అన్నారు. కొన్ని పంచాయతీల్లో సగటు కూలి చాలా తక్కువగా ఉందని, ఈ ధోరణి మారకుంటే సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. స్థానిక ఎన్‌ఆర్‌ఇజిఎ కార్యాలయంలో సామాజిక తనిఖీ ప్రజావేదికను మంగళవారం నిర్వహించారు. మండలంలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి గానూ నిర్వహించిన తనిఖీల నివేదికలను సామాజిక తనిఖీ డిఆర్‌పిలు చదివి వినిపించారు. వేతనాల రూపంలో రూ.9.50 కోట్లు, మెటీరియల్‌ కాంపోనెంట్‌ నిమిత్తం రూ.3.19 కోట్లు వెరసి రూ.12.69 కోట్లు మండలంలో ఖర్చు చేసినట్లు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ప్లాంటేషన్‌ పనుల్లో భాగంగా నాటిన మొక్కలు కొంతమేర లేవన్నారు. కేరాసింగి, సుందరాడ, పెద్దపద్మాపురం, జోడూరు, మర్రిపాడు (సి) పంచాయతీల్లో ఎం.బుక్‌ల్లో వ్యత్యాసాలను గుర్తించారు. అనంతరం పీడీ మాట్లాడుతూ సామాజిక తనిఖీ నివేదికలపై విచారణ చేసి నిధులు రికవరీ చేయడంతోపాటు అవసరమైతే చర్యలు కూడా తీసుకుంటామన్నారు. మస్టర్‌ షీట్లలో ఎటువంటి దిద్దుబాట్లు లేకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు. పోయిన మొక్కల స్థానంలో తక్షణమే కొత్త మొక్కలను నాటాలని ఆదేశించారు. మండల, పంచాయతీ స్థాయిలో ఎర్రర్‌ రిజిస్టర్లు తప్పకుండా నిర్వహించాలన్నారు. ఉద్యోగులు క్షేత్రస్థాయిలో అందరినీ సమన్వయం చేసుకొని విధులు నిర్వహించాలని పిలుపునిచ్చారు. పని ప్రదేశాల వద్ద ఆయా పనులకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన నేమ్‌ బోర్డులను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా విజిలెన్స్‌ అధికారి బి.లవరాజు, ఎపిడి శైలజ, హెచ్‌ఆర్‌ మేనేజర్‌ పి.శ్రావణ్‌ కుమార్‌, జెడ్‌పిటిసి గూడ ఎండయ్య, ఎంపిపి ప్రతినిధి బి.ఉదరు కుమార్‌, వైస్‌ ఎంపిపి ఎస్‌.ఆదినాయుడు ఎంపిడిఒ పి.చంద్రకుమారి, ఎస్‌ఆర్‌పి రమణ, ఎపిఒ రవి, ఇసి ఆదినారాయణ రెడ్డి, పలువురు సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.