Apr 04,2023 21:55

అంబేద్కర్‌ విగ్రహం ఎదుట నిరసన తెలుపుతున్న విద్యార్థి సంఘాల నాయకులు

         ప్రజాశక్తి-గుంతకల్లు   సెంట్రల్‌ యూనివర్శిటీ విద్యార్థులపై వెంటనే సస్పెన్షన్‌ ఎత్తివేయాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు సి.రమేష్‌ డిమాండ్‌ చేశారు. విద్యార్థులపై సస్పెన్షన్‌ వేటు వేయడాన్ని నిరసిస్తూ మంగళవారం స్థానిక అంబేద్కర్‌ విగ్రహం వద్ద ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ నాయకులు నోటికి రిబ్బన్లు కట్టుకుని మోకాళ్లపై కూర్చుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన సందర్భంగా రాయలసీమ సంక్షేమం, అనంతపురం అభివృద్ధి కోసం విభజన హామీల్లో భాగంగా అనంతపురం సెంట్రల్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారన్నారు. అయితే ఎనిమిదేళ్లు పూర్తవుతున్నా కనీసం భవనం కట్టకపోవడం శోచనీయమన్నారు. సెంట్రల్‌ యూనివర్సిటీకి జంతులూరు దగ్గర కేటాయించిన స్థలంలో కాంపౌండ్‌ వాల్‌ కూడా నిర్మించలేందంటే ఎంత నిర్లక్ష్యం వహిస్తున్నారో అర్థం అవుతుందన్నారు. ఇప్పటికే అద్దె భవనంలో ఉంటూ విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన వస్తోందన్నారు. మంచినీరు, భోజనం, వసతి వంటి మౌలిక సదుపాయాలు కల్పించడంలో యూనివర్సిటీ అధికారులు, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. అదేవిధంగా కంట్రోల్‌ ఆఫ్‌ ఎగ్జామినర్‌ చేసిన తప్పుల వల్ల అనేకమంది విద్యార్థులు ఫెయిలయ్యారన్నారు. ఈనేపథ్యంలో యూనివర్సిటీలో జరిగే అన్యాయాలు, అక్రమాలను ప్రశ్నించే విద్యార్థులను వైస్‌ఛాన్స్‌లర్‌ ఉద్దేశ పూర్వకంగా సస్పెండ్‌ చేయడం దౌర్భాగ్యమన్నారు. విసి దుర్మార్గమైన విధానాలను మానుకోవడంతోపాటు విద్యార్థులపై సస్పెన్షన్‌ ఎత్తివేయాలని, లేనిపక్షంలో దేశవ్యాప్తంగా ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి చరణ్‌, ప్రతాప్‌, చిరంజీవి, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు సుధాకర్‌, రాజేంద్రప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.
శింగనమల : సెంట్రల్‌ యూనివర్సిటీలో నెలకొన్న సమస్యలపై ప్రశ్నించిన విద్యార్థులను సస్పెండ్‌ చేయడం బాధాకరమని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శులు రాచేపల్లి సూర్యప్రకాష్‌, తరిమెల గిరి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ సెంట్రల్‌ యూనివర్శిటీలో కనీస మౌలిక వసతులు కల్పించడంలో విసి పూర్తిగా విఫలమయ్యారన్నారు. విభజన హామీల్లో ఒకటైన సెంట్రల్‌ యూనివర్శిటీ నిర్మాణంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రభుత్వం స్పందించి సెంట్రల్‌ వర్శిటీ విసిపై చర్యలు తీసుకోవడంతోపాటు విద్యార్థులపై సస్పెన్షన్‌ ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు గంగాధర్‌, వర్ధన్‌, బాబా ఫక్రుద్దీన్‌, సాయి, ఆదిత్య, అమీర్‌, తదితరులు పాల్గొన్నారు.