Jun 27,2023 21:34

విలేకరులతో మాట్లాడుతున్న ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి పరమేష్‌

           ప్రజాశక్తి- అనంతపురం కలెక్టరేట్‌   అనంతపురం సెంట్రల్‌ యూనివర్శిటీలో తెలుగు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీలో జరిగిన అవకతవకలపై విచారణ చేపట్టాలి ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓతూరు పరమేష్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం గణేనాయక్‌ భవన్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతీదాంట్లోను వ్యక్తిగత లాభం, స్వార్థం, కోసం అనుకున్నది సాధించదానికి ఎవరి కాళ్లయినా పట్టుకునే నైజం కలిగి వ్యక్తి గరికిపాటి నరసింహారావు అన్నారు. ధార్మిక ప్రసంగాలంటూ, భారత, రామాయణాలు అం టూ ఘనమైన శీర్షికలు పెట్టి మాట్లాడే ప్రవచనకర్త గరికిపాటి ఆగ డాలు మితిమీరిపోతున్నాయని విమర్శించారు. వచ్చిన పద్మశ్రీతో తనకు వచ్చిన పలుకుబడిని ఉపయోగించి ఇటీవల అనంతపురం సెంట్రల్‌ యూనివర్సిటీ అఫ్‌ ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు సహాయ ఆచార్యుల పోస్టులకు జరిగిన ఇంటర్వ్యూకు ఎన్నో అవకతవకలు చేసి తన కుమారుడు గరజాడను అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ను చేయడానికి సర్వశక్తులు ఒడ్డిపోరాడుతున్నారని విమర్శించారు. ఈ గరికిపాటి గురజాడ అనే వ్యక్తి ఈనెల 8న జరిగిన ఇంటర్వ్యూకు హాజరైన వారందరిలో అతి పిన్నవయస్కుడు అన్నారు. అర్హతలు లేనివాడన్నారు. కేవలం ఆన్‌లైన్‌లో గంటల వారీగా, సెమిస్టర్ల వారీగా సిలికానాంధ్ర యూనివర్సిటీలో క్లాసులు చెప్పిన గరికిపాటి గురజాడకు తనపరపతిని ఉపయొగించి పూర్తిస్ధాయి ఉద్యోగిగా సర్వీసు సర్టిఫికెట్టును సష్టించి, షార్ట్‌ లిస్టు అయ్యేలా చేసుకున్నాడని తెలిపారు. ఎంతోమంది సీనియర్లు, ఎప్పుడో పీ హెచ్‌డి చేసినవారు, విశ్వవిద్యాలయాల్లో, డిగ్రీ కాలేజీల్లో పని చేస్తున్నవారు, ఎన్నో పుస్తకాలు రాసి, సంపాదకులుగా వ్యవహరించి, వందలాది రీసెర్చ్‌ పేపర్లు ఉన్నవారిని కాదని, ఎలాంటి అనుభవం లేని తమ కుమారున్ని అందలం ఎక్కించడానికి ప్రయత్నం చేస్తున్నాడని తెలిపారు. గరికిపాటికి అంతరాత్మ అంటూ ఉంటే మీ అబ్బాయికి ఉద్యోగ ప్రయత్నాలను ఇంతటితో ఆపేసి, ప్రవచనాలకు సన్యాసం ఇచ్చేయమని గరికిపాటిని విజ్ఞప్తి చేశారు. గరికిపాటి గురజాడ అనుభవం కోసం పెట్టిన సర్టిఫికెట్టు అమెరికాలోని సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం నుంచి తెచ్చాడన్నారు. నిజానికి సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న అధ్యాపకులందరూ అతిథి అధ్యాపకులే అన్నారు. విశ్వవిద్యాలయ గ్రాంట్ల సంఘం నిబంధనల ప్రకారం అతిథి అధ్యాపకుల సర్వీసును పరిగణనలోకి తీసుకోరని తెలిపారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి విచారించాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు సిద్ధార్థ, నాయకులు విజరు, రాజేష్‌, శివ, అశోక్‌, మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.