Mar 27,2023 22:35

మాట్లాడుతున్న సిపిఎం నగర కార్యదర్శి వి.రామిరెడ్డి

ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్‌      చెత్త పన్ను రద్దుచేయాలని, పెంచిన ఇంటి పన్ను తగ్గించాలని, ప్రభుత్వ స్థలాలను కాపాడాలని, సెంట్రల్‌ పార్కు స్థలాన్ని సర్వే చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా పార్కును ఏర్పాటు చేయాలని సిపిఎం నాయకులు డిమాండ్‌ చేశారు. సోమవారం నగరపాలక సంస్థ కౌన్సిల్‌ సమావేశం జరుగుతున్న సమయంలో కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా సిపిఎం ఒకటవ నగర కార్యదర్శి రామిరెడ్డి మాట్లాడుతూ.. సెంట్రల్‌ పార్కు స్థలాన్ని మున్సిపాలిటీ రెవెన్యూ విభాగం స్వాధీనం చేసుకుని అక్కడ పార్కు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పినా మున్సిపల్‌ అధికారులకు చెవికెక్కడం లేదన్నారు. నగరపాలక సంస్థలో టౌన్‌ ప్లానింగ్‌, రెవెన్యూ విభాగాల్లో అక్రమాలు జరుగుతున్నాయని పత్రికల్లో కథనాలు రాస్తున్నా అధికారులు, పాలకుల్లో చలనం లేదన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి టౌన్‌ ప్లానింగ్‌, రెవెన్యూ విభాగాలను పూర్తిగా ప్రక్షాళన చేయాలని డిమాండ్‌ చేశారు. నగరంలో పాడైపోయిన రోడ్లను, మురుగు కాలువలను బాగుచేయాలని కోరారు. గత ఏడాది వరదలు వచ్చి నష్టపోయిన అనంత ప్రజానీకాన్ని ఆదుకోవాలని, భవిష్యత్తులో వరదలు రాకుండా నడిమివంక సైడ్‌ వాల్‌ పూర్తి చేయాలని, నీలిమ టాకీస్‌ నుండి తపోవనం రోడ్డును వెడల్పు చేసి, రిషిత స్కూల్‌ దగ్గర బ్రిడ్జిని నిర్మించాలని డిమాండ్‌ చేశారు. నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న పనుల్లో నాణ్యత కొరవడిందన్నారు. చిరు వ్యాపారాలు, తోపుడుబండ్ల వ్యాపారుల మీద సుంకాలను రద్దుచేయాలన్నారు. తాడిపత్రి బస్టాండులోని మున్సిపల్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌ తొలగించి కొత్త భవనాలు నిర్మించాలని కోరారు. అనంతపురం నగరంలో కుక్కల బెడద ఎక్కువగా ఉందని, వాటిని నగరానికి దూరంగా తీసుకెళ్లి సంరక్షించాలన్నారు. డిప్యూటీ మేయర్‌ కొగటం విజయభాస్కర్‌రెడ్డి నాయకుల వద్దకు వచ్చి తమ డిమాండ్లను కౌన్సిల్‌ సమావేశంలో చర్చిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర నాయకులు వెంకటనారాయణ, ప్రకాష్‌, మసూదు, బాబు, వలీ, ప్రసాద్‌, ఎన్టీఆర్‌ శీనా, రాజు, కెవిపిఎస్‌ వెంకటేష్‌, డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి నరసింహారెడ్డి, రజక వృత్తిదారుల సంఘం నాయకులు నాగభూషణం, శివరుద్ర, మల్లు, ఇస్మాయిల్‌, నాగరాజు, రామాంజి తదితరులు పాల్గొన్నారు.