Sep 26,2022 22:55

సెలవుల్లోనూ ఫేషియల్‌ అటెండెన్స్‌ వేయాలనటం సరికాదు
చిత్తూరు జిల్లా యుటిఎఫ్‌ కౌన్సిల్‌
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌:
జిల్లా మధ్యంతర కౌన్సిల్‌ సమావేశం చిత్తూరు యుటిఎఫ్‌ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు పి.సుధాకర్‌రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యదర్శులు టి.రఘుపతిరెడ్డి, ఎస్‌ఎస్‌.నాయుడులు ముఖ్యఅతిధులుగా విచ్చేసారు. వారు మాట్లాడుతూ దసరా సెలవుల్లో కూడా నాడు- నేడు పనులు జరుగుతున్న పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ప్రతిరోజు పాఠశాలకు వెళ్లి ఫేషియల్‌ యాప్‌ ద్వారా హాజరు వేయాలని అధికారులు ఉత్తర్వులు జారీ చేయడం తగదన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు దసరా సెలవులు సెప్టెంబర్‌ 26 నుండి అక్టోబర్‌ 6 వరకు సెలవులు ప్రభుత్వం ప్రకటించిందని, అయితే మరోపక్క నాడు-నేడు పనులు జరుగుతున్న పాఠశాలలకు ప్రధానోపాధ్యాయులు ప్రతిరోజు హాజరై ఫేషియల్‌ యాప్‌ ద్వారా హాజరు నమోదు చేయాలనే ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులు దొంగలుగా చూస్తూ నాడు-నేడు పనుల కోసం ఫేషియల్‌ ఆప్‌ అటెండెన్స్‌ వేయాలనటం దుర్మార్గమన్నారు. పండుగ సమయంలో కూడా ఉపాధ్యాయులను ఇలా వేధింపులకు గురిచేయడం తగదన్నారు. ఉపాధ్యాయులను ప్రభుత్వం నిరంతరం ఏదోకరకంగా వేధించడమే పనిగా పెట్టుకున్నదని విమర్శించారు. నాడు-నేడు అభివృద్ధి కార్యక్రమాల్లో ఉపాధ్యాయులు శక్తివంచన లేకుండా పనిచేస్తున్నారని, ఉపాధ్యాయులు నిరంతరం పనిచేయడం వల్లే నాడు- నేడు పనులు మంచి ఫలితాలను సాధించాయన్నారు. ఇప్పుడు కూడా నాడు-నేడు పనులను పర్యవేక్షించడానికి సిద్ధంగా ఉన్న ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా సెలవులలో సైతం ముఖ ఆధారిత హాజరు నమోదు చేయమని ఆదేశాలు ఇవ్వడం దారుణమన్నారు. విద్యాశాఖ వెకేషన్‌ డిపార్ట్మెంట్‌ అని, అలాంటిది సెలవులలో కూడా ఉపాధ్యాయులు నిర్బంధంగా ఫేసియల్‌ ఆప్‌ వేయాలని ఉత్తర్వులు జారీ అన్యాయమన్నారు. ఈ ఉత్తర్వులు జారీ చేయడం చూస్తే ఉద్దేశపూర్వకంగా ఉపాధ్యాయులను వేధించడమేనని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణమే ఈఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రధానకార్యదర్శి జీవీ.రమణ, గౌరవాధ్యక్షులు ఎం.సోమశేఖర్‌ నాయుడు, సహాధ్యక్షులు పిఆర్‌.మునిరత్నం, రెహానాబేగం, కోశాధికారి ప్రసన్న కుమార్‌, కార్యదర్శులు సరిత, మనిగండన్‌, ఎస్‌ఎం.బాషా, ఎంవి.రమణ, శశికుమార్‌, బిర్లా నాయుడు, సుధాకర్‌, కుప్పరాజు, ఏకాంబరం, వెంకటేశ్వరరెడ్డి, భానుప్రకాష్‌, యువరాణి, పార్థసారథి, అరుణ్‌ కుమార్‌, గణేష్‌, అన్ని మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, జిల్లా కౌన్సిలర్లు పాల్గొన్నారు.