Jun 23,2023 21:49

కార్యక్రమంలో మాట్లాడుతున్న సంయుక్త కలెక్టర్‌ కేతన్‌గార్గ్‌

              ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌  జిల్లాలోని విద్యార్థులు సేవాగుణాన్ని అలవర్చుకుని రెడ్‌క్రాస్‌ సంస్థను బలోపేతం కోసం తోడ్పాటు అందించాలని జాయింట్‌ కలెక్టర్‌ కేతన్‌గార్గ్‌ పిలుపునిచ్చారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా జూనియర్‌, యూత్‌ రెడ్‌క్రాస్‌ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని విద్యాసంస్థల విద్యార్థులు జూనియర్‌, యూత్‌ రెడ్‌ క్రాస్‌ విభాగంలో సభ్యత్వం తీసుకుని రెడ్‌క్రాస్‌ చేసే సేవ కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. విద్యార్థి దశ నుంచే సేవాగుణం, సేవాతత్వం అలవాటు చేసుకోవాలన్నారు. సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రణాళికాబద్ధంగా రెడ్‌క్రాస్‌ ప్రతినిధులు, విద్యా విభాగాధిపతులు సమన్వయంతో ముందుకు తీసుకెళ్లాలన్నారు. జిల్లా విద్య, వృత్తి విద్య శాఖలు, ప్రాంతీయ తనిఖీ అధికారి, శ్రీకృష్ణ దేవరాయల యూనివర్సిటీ, ప్రభుత్వ వైద్య కళాశాల, ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలతోపాటు వారి పరిధిలోని అన్ని విద్యాసంస్థలు జూనియర్‌ యూత్‌ రెడ్‌క్రాస్‌ విభాగంలో చేర్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో రెడ్‌క్రాస్‌ సంస్థ వైస్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ లక్ష్మణప్రసాద్‌, జిల్లా సెక్రటరీ హరిణిరెడ్డి, మోహన్‌కృష్ణ, ఆయా విద్యాసంస్థల అధికారులు తదితరులు పాల్గొన్నారు.