Aug 18,2022 23:29

వ్యవసాయ సలహా మండలి సమావేశంలో వక్తలు

వ్యవసాయ సలహా మండలి సమావేశంలో వక్తలు
ప్రజాశక్తి - చిత్తూరుఅర్బన్‌

రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని ఆదుకునేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతోందని రైతు భరోసా కేంద్రం స్థాయి నుంచి వ్యవసాయ రంగంలో రైతులకు మెళకువలతో పాటు విత్తనాల నుంచి కొనుగోలు వరకు అధికారులు రైతులకు సహకరిస్తున్నారని జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ రామచంద్రారెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశం గురువారం కలెక్టరేట్‌ లోని సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ సభ మండల చైర్మన్‌ మాట్లాడుతూ మామిడి పంటను సేంద్రీయ విధానంలో సాగు చేయడం ద్వారా పెట్టుబడులను తగ్గించి నాణ్యత పెరిగి ఆర్గానిక్‌ పంట ద్వారా అత్యధిక ఆదాయం వచ్చే అవకాశం ఉందని, ఇప్పటికే ఉద్యాన శాఖ వారు రైతులకు అవగాహన కల్పించేందుకు పలు అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నారన్నారు. ఆర్‌ బి కే స్థాయిలో ఈ అవగాహన సదస్సులను నిర్వహించాలని, అదేవిధంగా జిల్లాలో ఉన్న కస్టమర్‌ హైరింగ్‌ సెంటర్లను మరిన్ని పెంచాలని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి ఎన్‌. రాజశేఖర్‌ మాట్లాడుతూ పంటలకు బీమా సౌకర్యం కల్పించి నష్టం వస్తే వెంటనే ఆదుకోవడం జరుగుతుందని అన్నారు. ఎన్నడు లేని విధంగా రైతు భరోసా కేంద్రంలో రైతుల వద్దకే విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు ఇవ్వడం జరుగుతోందన్నారు.
జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళీకష్ణ మాట్లాడుతూ జిల్లాలోని 52 రైతు భరోసా కేంద్రాలకు సంబంధించి ఇంకా 205 రైతు భరోసా కేంద్రాలకు యంత్రాలను సమకూర్చాల్సి ఉందని, అదేవిధంగా ప్రతి మండలానికి మూడు డ్రోన్లను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ఇందుకు 50 శాతం సబ్సిడీతో సిహెచ్సి లకు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. జిల్లాలు గతంలో ఇచ్చిన రెయిన్‌గన్లు, పైపులు, స్ప్రింక్లర్లు, బాగున్నవి రైతు భరోసా కేంద్రాల్లో ఉంచడం జరుగుతుందని వాటిని రైతులు ఉపయోగించుకోవచ్చునన్నారు. ప్రత్యామ్నాయ పంటల కింద ఉలవలు, మొక్కజొన్నలు, కందులు సరఫరా చేయడం జరుగుతుందని అన్నారు. జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి వెంకటరావు మాట్లాడుతూ ఈనెల 16 నుంచి జిల్లాలోని 7.1 లక్షల గొర్రెలు, మేకలకు నట్టల నివారణ కోసం మందులు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఉద్యానవన శాఖ అధికారి వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ మామిడికి ప్రత్యామ్నాయ పంటగా అల్లనేరేడు, జామ పంటలను ప్రోత్సహించడం జరుగుతుందని, ఈ ఏడాది 200 ఎకరాలలో ప్రయోగాత్మకంగా ఇవ్వడం జరుగుతుందని అన్నారు. మామిడిలో సేంద్రీయ వ్యవసాయం 2500 ఎకరాల్లో చేసేందుకు తగిన చర్యలు తీసుకోబడుతున్నాయని అదేవిధంగా ఆయిల్‌ ఫామ్‌ కంపెనీ 30న మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేస్తుందని అన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 8725 హెక్టార్లలో డ్రిప్‌ వేసేందుకు 8569 మంది రైతులు దరఖాస్తు చేసుకోవడం జరిగిందని ఇందుకు 23 కంపెనీలు ముందుకు వచ్చాయని అన్నారు. సిరికల్చర్‌ పంటలు ఇన్సూరెన్స్‌ పథకం కోసం అమలు చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వాల్సి ఉంటుందని సిరికల్చర్‌ జెడి శోభారాణి అన్నారు. దేశవాళీ ఆవుల ను పెంపొందించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఎంతగానో ప్రోత్సహిస్తున్నారని జిల్లాలో భారీ ఎత్తున ఇస్తున్నారని అధికారి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి వెంకటేశ్వర్‌ రెడ్డి, జిల్లా పట్టు పరిశ్రమ శాఖ అధికారిని శోభారాణి, మార్కెటింగ్‌ శాఖ అధికారి పరమేశ్వర్‌ పాల్గొన్నారు.