సదుంలో గడపగడపకు మన ప్రభుత్వం
ప్రజాశక్తి- సోమల: మండల కేంద్రమైన సదుం గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు శనివారం తంబళ్లపల్లె శాసనసభ్యులు పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి పురవీధులలో తిరిగి ప్రతి కుటుంబాన్ని పలకరించి ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరు పై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజలకు అందజేస్తున్నారని ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందాలన్నదే లక్ష్యంగా గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రతి కుటుంబాన్ని కలిసే విధంగా ఆయన కార్యాచరణ రూపొందించారని అన్నారు. అందులో భాగంగా ప్రతి కుటుంబాన్ని కలిసి సంక్షేమ పథకాల అమలు, సమస్యలు, పథకాలు చేరుతున్నాయా లేదా అన్న విషయాలను అడిగి తెలుసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, మండల స్థాయి అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.










