సచివాలయానికి రూ.20 లక్షలు కేటాయింపు : ఎమ్మెల్యే
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్ : చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో అన్ని వార్డుల్లో సమగ్ర అభివృద్ధి జరగాలని, ఇందుకోసం అవసరమైన ప్రణాళికలు తయారు చేయాలని చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చెప్పారు. శనివారం సాయంత్రం మేయర్ ఎస్.అముద, కమిషనర్ డాక్టర్ జె.అరుణ, డిప్యూటీ మేయర్లతో కలసి నగరపాలక సంస్థ పరిధిలో 'గడపగడపకు మన ప్రభుత్వం' పూర్తయిన వార్డులకు సంబంధించి కార్పొరేటర్లు, వార్డుకార్యదర్శులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో అభివద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సి ఉందని అన్నారు. ఎమ్మెల్యేల వినతి మేరకు... ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రతి సచివాలయానికి రూ.20లక్షలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు చెప్పారు. ఈనిధులతో వార్డు సచివాలయం పరిధిలో ప్రాధాన్యత క్రమంలో మురుగునీటి కాలువలు, రోడ్లు, రోడ్ల మరమ్మతులు, తాగునీటి పథకాలు, పైప్‌లైన్‌లు వంటి పనులు చేపట్టాలన్నారు. అలాగే గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజల నుంచి అందిన వినతుల మేరకు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. స్థానిక వార్డు కార్పొరేటర్లు, వార్డు కార్యదర్శులతో సమన్వయం చేసుకొని అభివద్ధి పనులు చేపట్టాలన్నారు. ఇందుకు అదనంగా ఒక్కో వార్డుకు రూ.5 లక్షలు నగరపాలక సంస్థ నుంచి కేటాయించినట్లు చెప్పారు. 15వ ఆర్థిక సంఘం నిధులతోనూ అభివద్ధి పనులు చేపట్టాలన్నారు. నగర మేయర్ ఎస్.అముద మాట్లాడుతూ ప్రభుత్వం కేటాయించిన నిధులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కమిషనర్ డాక్టర్ జె.అరుణ మాట్లాడుతూ అందిన వినతుల్లో ఆర్థిక పరమైన అంశాలకు సంబంధించిన అభివద్ధి పనులను చేపట్టడానికి స్థానిక అధికారులు సత్వరం కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. స్థానిక కార్పొరేటర్లను భాగస్వామ్యం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు చంద్రశేఖర్, రాజేష్ కుమార్‌రెడ్డి, సహాయ కమిషనర్ గోవర్థన్, వార్డు కార్పొరేటర్లు, నగరపాలక అధికారులు, వార్డు కార్యదర్శులు పాల్గొన్నారు.










