Sep 21,2023 22:16

సచివాలయాల్లో పౌర సేవలు పెంపు : డిఆర్‌ఓ
ప్రజాశక్తి- చిత్తూరు : రాష్ట్ర ప్రభుత్వం సచివాలయాల స్థాయిలోనే పౌరసేవలను దాదాపు 540 సేవలను అందజేయడం జరుగుతున్నదని, ఈ సేవలను విస్తతం చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని జిల్లా రెవెన్యూ అధికారి ఎన్‌.రాజశేఖర్‌ పేర్కొన్నారు. గురువారం డిఆర్‌ఓ ఛాంబర్‌ వద్ద గల సమావేశపు మందిరంలో సచివాలయ స్థాయిలో నోటరీ, అఫిడవిట్‌ సేవలకు సంబంధించిన అంశంపై జిల్లా రిజిస్ట్రార్‌ శ్రీనివాస్‌రావుతో కలసి నోటరీ వారితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డిఆర్‌ఓ మాట్లాడుతూ సచివాలయ సేవలను విస్తతం చేయడంలో భాగంగా సచివాలయాల ద్వారా జనన, మరణ ధ్రువపత్రాల జారీ, మ్యూటేషన్‌లకు సంబంధించి వారంలో రెండు రోజులు సోమ, గురువారాలలో నోటరీలు అందుబాటులో ఉండి సామాన్య ప్రజలకు సేవలు అందించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఇందుకు సంబంధించి ఏ సచివాలయానికి ఏ నోటరీ అనే దాన్ని మ్యాపింగ్‌ చేయడం జరుగుతుందని డిఆర్‌ఓ తెలిపారు. ఈసమావేశంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న నోటరీలు పాల్గొన్నారు.